అసెంబ్లీలో పరువు పోయింది. లోక్‌సభలోనైనా కాపాడుకోవాలి. ఇదీ రెండు జాతీయ పార్టీల ఆలోచన. గులాబీ బాస్ బహుముఖ వ్యూహాలకు, ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ నడిపిస్తున్న రాజకీయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. కానీ అనూహ్యంగా జరుగుతున్న పరిణామాలే కాస్త బెరుకు పుట్టిస్తున్నా గమ్యాన్ని ముద్దాడే గమనం వైపు నడుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు టీఆర్ఎస్‌కే కాదు రెండు జాతీయ పార్టీలకూ కీలకమే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఇది జీవన్మరణ సమస్య. బలమైన నేతలు ఒక్కొక్కరుగా చేతిని వదిలేసి పోతుంటే చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేని నాయకత్వం ఉన్న వారిని కాపాడుకునే వ్యూహానికి పదును పెడుతుంది.
కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్న క్యాడర్ కూడా గుట్టు చప్పుడు కాకుండా వేరే పార్టీల ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని అప్రోచ్ అవుతుంటే నాయకులు మాత్రం మొహమాటలకు తావులేకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. టీఆర్ఎస్ స్వీట్ సిక్స్‌టీన్ అంటుంది. 17 స్థానాల్లో ఒకటి మిత్రపక్షమైన ఎంఐఎంకు వదిలేసి పదహారుకు పదహారు ఖాతాలో వేసుకోవాలన్నది గులాబీ వ్యూహం. అందుకే ప్రత్యర్థి పార్టీలోని బలమైన నేతలకు గాలం వేస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా ప్రయోగిస్తూ కారెక్కడం తప్ప మరో దారి లేదన్నట్టుగా నేతలను లాక్కుంటుంది. ఇందులో స్వచ్ఛందంగా వచ్చే వారు కొందరైతే రాజకీయ ప్రయోజనాలు ఆశించి వస్తున్న వారు మరికొందరు.
భారతీయ జనతా పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు ఒకే ఒక్క సీటు దక్కించుకున్న కమలం పార్టీ లోక్‌సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 17 సీట్లలో బలమైన స్థానాల్లో ఉనికి చాటడమే కాకుండా మూడు నుంచి నాలుగు సీట్లు సాధించి హస్తినలో తమ పరువు కాపాడుకోవాలన్న తపనతో ముందుకెళ్తుంది. ఏమైనా మార్పు మంచికైనా వేరే ప్రయోజనానికైనా లోక్‌సభ ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ రణరంగంలో మరింత కాక పుట్టిస్తున్నాయి.