తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన చౌరస్తాలో దిక్కులు చూస్తోంది. సమర్ధవంతమైన నాయకత్వ లోపం, నేనే మోనార్క్‌ని అంటూ హై కమాండ్ నిర్ణయాలు టి.కాంగ్రెస్ భవితవ్యాన్ని సందేహంలో పడేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలయ్యేటప్పటికే కాంగ్రెస్ బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీల ఆపరేషన్ ఆకర్షే కానివ్వండి సొంత ప్రయోజనాలే కానివ్వండి ఏమైనా
కోలుకోలేని స్థితిలో పడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌కి కాయకల్ప చికిత్స అక్కరకొస్తుందా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిని చూసిన వారెవరికైనా ఈ అనుమానాలు కలగకమానవు బలహీనతలు, వైఫల్యాలు, రాజకీయ పోకడలను పక్కన పెడితే సమర్ధ నాయకత్వంలేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కానీ తాజా లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కానీ హై కమాండ్ తలంటిపోసినా మళ్లీ తిరిగొచ్చాక ఎవరి తీరు వారిదే.. ఎవరిగోల వారిదే.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు జనం ముందుకు ఏ ముఖం పెట్టుకు వెళ్లాలో తెలియని పరిస్థితిని తీసుకొచ్చేశాయి. ఏం చెప్పి ఓటేయమని అడగాలన్న సందేహాలు చుట్టుముడుతున్నాయి.
తెలంగాణ విభజన రూపంలో కాంగ్రెస్ నౌకకు పడిన చిల్లు అంతకంతకి పెద్దదై ఇప్పుడు పార్టీయే మునిగిపోయే దశకు చేరుకుంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కకావికలమవుతుంది. నడీ సముద్రంలో నావలా ఒడ్డు చేర్చే నావికుడి కోసం ఎదురుచూస్తోంది. తీరంలో కనిపించని సునామీ... దాటిన తర్వాత చూపిస్తున్న బీభత్సానికి చేష్టలుడుగి చూస్తోంది. దీనికి తోడు చాపకింద నీరులా చొచ్చుకుపోతున్న బీజేపీ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతుంది. డీకే అరుణలాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది కూడా కమలం మాయలో పడిపోవడంతో కాంగ్రెస్ షాక్‌కు గురవగా క్యాడర్‌లో ఒకరకమైన నిస్తేజం కనిపిస్తోంది.
నిజానికి ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా మంది నేతల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గతీ... స్థితి ఏమిటో తేల్చేది కచ్చితంగా ఈ ఎన్నికలే. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉందో లేదో తేల్చేది కూడా ఈ ఎన్నికలే. హద్దు మీరుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలతో ఒడ్డుకు చేరుకోలేకపోతున్న హస్తం పార్టీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమకు కంచుకోటలా భావించే రెడ్డి, దళిత సామాజికవర్గాలతో పాటు ఓటర్లు ఇప్పుడా పార్టీని నమ్మడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.