ఆర్థిక మంత్రి లేకుండానే తెలంగాణ బడ్జెట్?... అంతుపట్టని కేసీఆర్‌ వ్యూహం

Update: 2019-02-02 04:46 GMT

తెలంగాణ సర్కారు బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం...ఇచ్చిన హామీలు అమలు చేయడానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ.. సీఎం దగ్గరే ఉండడంతో ఆయన నేతృత్వంలోనే బడ్జెట్ తయారవుతోంది. ఈసారి బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారు..? ఆర్థిక మంత్రి లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా అనే ఆసక్తి నెలకొంది. కేంద్రం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకు కేటాయింపులపై అస్పష్టత నెలకొంటుందనే ఉద్దేశంతో తెలంగాణలోనూ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల మూడో వారంలో జరిగే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలుండడంతో ఆదివగా కసరత్తు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావించినా..మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్ , జులైలో బడ్జెట్ కోసం పార్లమెంటు సమావేశమవుతుంది. అప్పుడే నిధులపై స్పష్టత వస్తుంది కాబట్టి ఆరు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందిస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం ఆర్థిక మంత్రి లేకపోవడంతో బడ్జెట్ వ్యవహారాలను సీఎం కేసీఆరే చూస్తున్నారు. ఆర్థిక శాఖ ఆయన దగ్గరే ఉండడంతో పద్దు లెక్కల్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ..గత బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ ఉందబోతోందని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు సాయం పెంపునకు అదనపు నిధులు కేటాయించాల్సి ఉంది. అలాగే మరికొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశ పెట్టతారని సమాచారం. అందుకే గత బడ్జెట్‌ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మించిపోనుందని తెలుస్తోంది. సాధారణంగా శాసన సభలో ఆర్థిక మంత్రి, శాసన మండలిలో సీనియర్ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఆర్థిక శాఖ సీఎం దగ్గరే ఉండడంతో ఈసారి ఆయనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారా అనే సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ బడ్జెట్ సమావేశాల్లోపు మంత్రి వర్గ విస్తరణ చేసి ఆర్థిక మంత్రిని నియమించకపోతే...కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండా బడ్టెట్ సమావేశాలు జరగడం..స్వయానా ముఖ్యమంత్రే బడ్జెట్ ప్రవేశ పెట్టడం రికార్డేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మంత్రి వర్గ విస్తరణ చేసి ఆర్థిక శాఖ మంత్రిని నియమిస్తారా... లేక సీఎం కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తారో వేచి చూడాలి  

Similar News