డిసెంబర్‌లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం తమ ఎమ్మెల్యేలకు సర్పంచ్ ఎన్నికల బాధ్యత అప్పజెప్పింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి పోటీ ఎక్కువగా ఉంది. తమకే టికెట్ దక్కేలా చూడాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఏ గ్రామపంచాయతీలో ఏ వర్గానికి చెందినవారు పోటీ చేయాలో తేలిపోయింది.
మెజారిటీ పంచాయతీల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చిన చోట, నాయకులు ఎక్కువగా ఉన్నచోట ఈ ఎన్నికల్లో పోటీకి డిమాండ్ పెరిగింది. ప్రధానంగా జనరల్ స్థానాల్లో ఒకరికి మించి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 వేల 732 గ్రామ పంచాయతీలుండగా.. లక్ష 13 వేల 170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ఇందుకోసం మొత్తం లక్ష 13 వేల 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటయ్యాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో పట్టును మరింత పెంచుకుని రానున్న పార్లమెంట్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించేందుకు పార్టీలు గ్రామ పంచాయతీ పోరునే ప్రధాన వేదికగా ఉపయోగించుకునేలా కనిపిస్తోంది.
వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల రహిత ఎన్నికలు. అయినా... పల్లెల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారే పోటీ పడుతున్నారు. ఆయా పార్టీలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఈ కారణంగానే శాసనసభ ఎన్నికలు ముగియగానే మరోమారు రాజకీయ నాయకుల పర్యటనలతో గ్రామాలు వేడెక్కుతున్నాయి. దాదాపు ఏడాదికాలంగా పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కిందిస్థాయి నాయకులు ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదన్న నిర్ణయంతో ఉన్నారు. మరోవైపు సర్పంచ్ టికెట్ల కోసం పోటీపడుతున్న నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.
శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా.. గ్రామీణ ప్రాంతంపై తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కారణంగానే ఆ పార్టీ నేతలు కూడా తమ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఈనెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తమ బలం చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు కూడా ఆర్థిక అంశంతో ముడిపడినవే కావడం, ఎన్నికల ఖర్చును భరించగల ఆర్థిక స్థోమత ఉన్నవారే పోటీ చేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయి. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా గతం నుంచి తమకు బాగా పట్టున్న గ్రామాల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో కాకుండా మండలంలో కనీసం రెండు మూడు పంచాయతీలపైనైనా ప్రత్యేక దృష్టి సారించాలని వామపక్ష పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండానే .. గ్రామాల్లో మంచి పేరున్న యువకులను పోటీకి నిలబెట్టాలన్న ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.