జమ్మూకాశ్మీర్‌‌పై బీజేపీకి టీడీపీ మద్దతు వెనక మతలబేంటి?

Update: 2019-08-06 03:04 GMT

జమ్మూకాశ్మీర్‌ పునర్‌ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై దేశమంతా ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే సహా అనేక విపక్ష పార్టీలు బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టీడీపీ మాత్రం మద్దతిచ్చింది. మొన్నటి వరకు దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ, నియంతృత్వంగా పాలిస్తోందంటూ బీజేపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు, కాశ్మీర్‌ విషయంలో కాషాయానికి సపోర్ట్ ఇవ్వడం వెనక మతలబేంటి...విపక్షాలకు దూరంగా, అధికార పక్షానికి దగ్గరగా జరగడం దేనికి సంకేతం.? బీజేపీతో గొడవెందుకుని మళ్లీ చేయి కలిపేందుకు ఇదొక సంకేతమా?

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, జమ్మూకాశ్మీర్‌గా, లడఖ్‌గా రెండుగా విభజిస్తూ, కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై దేశమంతా చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున రచ్చయ్యింది. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ ఇలా ప్రధాన విపక్షాలన్నీ, బీజేపీ సర్కారు తీరును వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రాజ్యాంగ స్ఫూర్తిని మోడీ, అమిత్‌ షాలు తుంగలో తొక్కారని విమర్శించాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు ఎటు వైపు ఉన్నారన్నది చాలా ఆసక్తి కలిగించే పరిణామం. కానీ మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించిన తెలుగుదేశం, ఆల్‌ ఆఫ్ సడెన్‌గా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బీజేపీ నిర్ణయానికి అనుకూలంగా మద్దతివ్వడం, రాజకీయాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయానికి తెలుగుదేశం మద్దతిస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అలాగే రాజ్యసభలోనూ ఆ పార్టీ ఎంపీలు సపోర్ట్ ఇచ్చారు. విపక్షాల్లో అత్యధిక పార్టీలు వ్యతిరేకిస్తున్నా, టీడీపీ మాత్రం సపోర్ట్ చేయడంపై అనేక ఇంట్రెస్టింగ్‌ అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు ఎందుకింత త్వరగా బీజేపీ మీద మనసు మార్చుకున్నారన్న చర్చ మొదలైంది.

ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఫలితాల వరకు కూడా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు చాలా కీలకంగా వ్యవహరిస్తూ, ప్రయత్నాలు చేశారు చంద్రబాబు. ఆ పార్టీలన్నింటినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు చాలా రాష్ట్రాలు తిరిగారు. మోడీ తీసుకున్న నిర్ణయాలన్నీ అప్రజాస్వామికమని, నియంతృత్వమని, అన్ని వ్యవస్థలనూ ధ‌్వంసం చేశారని తీవ్రంగా విమర్శించారు. కానీ ఎన్నికల్లో ఘోర ఓటమి, చంద్రబాబు అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిని కల్పించింది. సొంత పార్టీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఉన్న ముగ్గురు లోక్‌సభ ఎంపీల్లో కూడా కొందరు కాషాయ నేతలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు, వైసీపీ ఎదురుదాడి, ఇలా వరుస పరిణామాలు బాబును కుదురుగా ఉండనివ్వడలేదు.

దీనికితోడు ఏపీలో బలపడేందుకు టీడీపీని ఖాళీ చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బాబుతో పాటు చాలామందిపై కేసులను తిరగతోడటం ఖాయమని, సీబీఐ కేసులు కూడా వేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. సాగుతోంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తగవు పెట్టుకోవడం ఎందుకని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢీకొట్టడం సాధ్యం కాదని, చంద్రబాబు కూడా భావించారేమోనని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీజేపీతో సామరస్యానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారన్న సంకేతాలు అందుతున్నాయి. దానిలో భాగమే పార్లమెంట్‌లో పలు చట్టాలకు టీడీపీ, పరోక్ష, ప్రత్యక్ష పద్దతిలో మద్దతన్న ప్రచారం మొదలైంది.

ట్రిపుల్ తలాఖ్ బిల్లుపైనా బీజేపీని నొప్పించుకుండా, తానొవ్వకుండా అన్నట్టుగా వ్యవహరించింది తెలుగుదేశం. ట్రిపుల్ తలాక్‌ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, వైసీపీ వ్యతిరేకించాయి. కానీ సభకు డుమ్మాకొట్టి పరోక్షంగా బిల్లుకు మద్దతిచ్చినట్టయ్యింది టీడీపీ తీరు. ఇప్పుడు ఏకంగా ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ ఇవ్వడంతో బీజేపీకి దగ్గరవుతోందన్న అనుమానాలకు మరింత బలమిస్తోంది. దీనికితోడు మొన్న ఏపీలో పర్యటించిన బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ కూడా, ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని వ్యాఖ్యానించి, టీడీపీ పాలనే బెటరన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎన్నికల నాటికి టీడీపీ-బీజేపీ తిరిగి కలిసినా కలవొచ్చన్న ఊహాగానాలకు ఈ పరిణామాలన్నీ బలం చేకూరుస్తున్నాయి.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటం, కేంద్రంలో బీజేపీ పవర్‌లో ఉండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారని, ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండటం మంచిదికాదన్నట్టుగా, బాబు మెత్తబడ్డారని అంటున్నారు. దీని వెనక మొన్న బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి మంత్రాంగం నడపారన్న మాటలకూ కొదువలేదు. అయితే కాశ్మీర్‌ విశాల ప్రయోజనాల నేఫథ్యంలోనే బీజేపీకి మద్దతిచ్చినట్టు టీడీపీ నేతలంటున్నారు.

మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, ఏపీలో రాజకీయ పరిణామాలను వేడెక్కిస్తున్నాయి. వైసీపీ మీద బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం ఒక పరిణామం అయితే, ఇప్పుడు బీజేపీ నిర్ణయాలకు టీడీపీ సపోర్ట్ ఇవ్వడం మరో పరిణామం. ఇవన్నీ భవిష్యత్‌ పరిణామాలకు సంకేతమన్న విశ్లేషణలూ జోరందుకున్నాయి. అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు, మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, విపక్షాలకు ఎలాంటి షాకులిస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎంతైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నదానికి, ఇలాంటి పరిణామాలే నిదర్శమని, రాజకీయ విశ్లేషకులు అప్పుడే అంచనాలు కట్టేస్తున్నారు.

Full View

Tags:    

Similar News