సత్తెనపల్లిలో కోడెలకు సెగ ఎందుకు తీవ్రమవుతోంది?

Update: 2019-08-09 01:35 GMT

ఆయన ఒకప్పుడు ఆర్డర్‌ ఆర్డర్‌ అంటూ లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకే ఆర్డర్‌ వేశారు. అరిస్తే కళ్లు ఉరిమి చూశారు. నిరసన చేస్తే, సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజాప్రతినిధులను గడగడలాడించారు. కానీ వన్‌ఫైన్ డే, ఆయన ఓడిపోయారు. అధికారం పోయింది. ఇప్పుడాయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోనే, అసంతృప్తి జ్వాల భగ్గుమంది. ఆయనను తప్పిస్తారా...లేదంటే ఉద్యమం చేయాలా అని, ఏకంగా చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారు. తనకెంతో సన్నిహితుడైన ఆ మాజీ స్పీకర్‌ను ఏమీ అనలేక, కార్యకర్తల గోడు తోసిపుచ్చలేక, సతమతమైపోతున్నారు చంద్రబాబు. ఇంతకీ బాబు గారి దగ్గర పంచాయతీ ఎవరిదో మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా.

మొన్నటి వరకు నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఒక వెలుగు వెలిగిన కోడెల శివప్రసాద్ రావుకు, ఎన్నికల్లో ఓటమి తర్వాత బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయినట్టు కనిపిస్తోంది. స్పీకర్‌గా విచక్షణాధికారాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికార పార్టీ, ఇప్పటికే విచారణలు చేస్తోంది. కొడుకు, కుమార్తెలు కే ట్యాక్స్‌ వసూలు చేస్తూ, అవినీతిలో చెలరేగిపోయారని కేసులు కూడా ఫైల్‌ అయ్యాయి. ఇలా ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలోనే, సొంత పార్టీలో, అందులోనూ సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలుకావడం, కోడెలను కుదురుగా ఉండనివ్వడం లేదు.

కోడెల కుటుంబం ఐదేళ్లపాటు సాగించిన అరాచకాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు స్వరం పెంచారు. ఆయన కుటుంబం అవినీతి కార్యకలాపాలతో విసిగి వేసారిపోయామని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలంటూ గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. ముప్పాళ్ళ మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు తదితరుల నాయకత్వంలో, అసమ్మతి వర్గీయులు తొలుత సత్తెనపల్లి పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద కోడెలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

ఆ తర్వాత 200 మందికిపైగా అసమ్మతి నేతలు, కార్యకర్తలు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొత్త ఇన్‌చార్జిని నియమించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు కోడెల శివప్రసాదరావు సైతం రాష్ట్ర కార్యాలయంలోనే ఉన్నారట. దీంతో మరింత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అసమ్మతి నేతలు.

అసమ్మతి నేతలు చంద్రబాబును కలవకముందే కోడెల శివప్రసాదరావు, స్వయంగా పార్టీ అధినేతను కలిశారు. తనకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో జరుగుతున్న కార్యకలాపాల గురించి, తన వాదన వినిపించారట. ఇటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అటు కోడెల వాదనలు వేర్వేరుగా విన్న చంద్రబాబు, 'యూ డోంట్‌ వర్రీ.. నేను చూసుకుంటా' అని వారితో చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సత్తెనపల్లిలో కోడెల అసమ్మతి వర్గాన్ని ఏకతాటిపైకి తేవడంలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు, రాయపాటి రంగారావు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కోడెల వ్యతిరేకులను ఏకం చేసి, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేకవర్గం స్వరం పెంచుతోంది. నియోజకవర్గ ఇన్‌‌ఛార్జిగా కోడెలను వెంటనే తొలగించి, కొత్తవారిని నియమించాలన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది. ఇంటా బయటా నిరసనలు పెరుతుండటంతో, కోడెల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు ఇరు వర్గాలను ఎలా సముదాయించాలో అర్థంకాక, పార్టీ అధినేత తలపట్టుకుంటున్నారు. చూడాలి, తన రాజకీయ జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు చూస్తున్న కోడెల, వీటన్నింటిని చూసి ఎలా బయటపడతారో, ఆయన పొలిటికల్ జర్నీ, ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో..

Full View


Tags:    

Similar News