ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. మైక్ పట్టారంటే దడదడలాడాల్సిందే. దశాబ్దాల పాటు పాలన సాగించిన పార్టీలో ఆయన మోస్ట్ సీనియర్. అందులోనూ ఆయన మంత్రిగానూ చేశారు. కానీ పాపం ఎన్నికలు ఆడుతున్న వింత నాటకంలో ఆయన ఓడిపోతూ....నే ఉన్నారు. ఇంతకీ పట్టువదలకుండా, ఓటమి దండయాత్ర చేస్తున్న ఆ గజినీ మొహమ్మద్ ఎవరు? ఆయన ఫ్యూచరేంటి?
సంచలన రాజకీయాల సింహపురి పాలిటిక్స్‌లో ఆయనది దశాబ్దాల ప్రస్థానం. పాతతరం రాజకీయ నేతల నుంచి, నేటి యువతరం వరకు, అనేక రాజకీయ పరిణామాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. రాజకీయ ఎత్తులు, పైఎత్తుల్లో అపర చాణక్యుడు. అపార అనుభవశాలి. తెలుగు నేలపై ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్‌తో నేరుగా వెళ్లి మాట్లాడగలిగిన నాయకుడిగా పేరున్న నేత. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు నాయకత్వంలోనూ కీలక పదవుల్లో పని చేసి, రాజకీయ యవనికపై తన దైన ముద్ర వేసుకున్న లీడర్. అతనే తాజామాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడర్.
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో రాజకీయ ఆరంగేట్రం చేసి గెలిచారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వరుసగా 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటూ జిల్లాలోనూ పార్టీపై మంచి పట్టుసాధించారు. తనదైన రాజకీయ శైలిని కనబరిచారు. అయితే 1999 అంటే మూడోసారి పోటీతో ఆయన పరాజయాల ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పొరపాటున కూడా ఆన విజయాల ట్రాక్ పట్టలేదు. 1999 తరువాత, ఆయన్ను రాజకీయ దురదృష్టం వెంటాడుతోంది. పోటి చేసిన ప్రతి ఎన్నికలోనూ ఆయన ఓటమిని చవిచూస్తూ వచ్చారు. ఒకటికాదు, రెండుకాదు వరుసగా ఐదుసార్లు ఓటమి. అంటే రెండు దశాబ్దాలుగా సోమిరెడ్డిని ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓటమి వెంటాడుతూనే ఉంది.
రాష్ట్ర విభజన తరువాత అనూహ్యంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి ఓడిపోయారు. అయినా పార్టీ అధినాయత్వం సోమిరెడ్డికి సముచిత స్థానం కల్పించింది. అప్పటి ప్రతిపక్ష వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంలో, అధినాయకత్వాన్ని ఆకర్షించగలిగారు సోమిరెడ్డి. తమ పార్టీ కంటూ ఓ స్పోక్స్ పర్సన్ ఉండాలన్న ఆలోచనతో అధిష్టానం సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేసింది. దీంతో నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తరువాత అప్పటి వరకు తెరవెనుక రాజకీయాలకే పరిమితమైన నారాయణను వెలుగులోకి తెచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు. అదే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డికి తలనొప్పిగా మారింది. నిరంశకుశ వైఖరి, గ్రూపు రాజకీయాలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో సోమిరెడ్డికి చెక్‌పెట్టేందుకే, నారాయణను రంగంలోకి దించారని నాడు పార్టీలో జోరుగా చర్చ జరిగింది.
2014 ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన తరువాత, నియోజకవర్గంలో మరింతగా పట్టు సాధించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు సోమిరెడ్డి. అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లారు. అంతేకాదు తన రాజకీయ వారసుడుగా తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపి, నియోజకవర్గ బాధ్యతలు సైతం అప్పగించారు. తాను మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో తన కుమారుడు నియోజకవర్గంలో పర్యటించే విధంగా, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేలా రాజకీయ వ్యూహాన్ని రచించారు. అప్పటికే నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డే టార్గెట్‌గా పని చేశారు సోమిరెడ్డి ఆయన తనయుడు. అంతేకాదు 2019 ఎన్నికల్లో తన విజయం తథ్యమని ప్రగాఢంగా విశ్వసించారు. నియోజకవర్గంలో గతంలో కన్నా పార్టీ పరిస్థితి మెరుగైందని, టిడిపి బలంగా మారిందన్న ధీమాలో ఉండిపోయారు. గెలుపుధీమాతో ఎన్నికలకు ముందే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సోమిరెడ్డి. ఓడిపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.
వరుస పరాజయాలతో సోమిరెడ్డి రాజకీయ భవితవ్యంపై నీలినీడలుమ్ముకుంటున్నాయి. రెండుదశాబ్దాలుగా అపజయాలే పునాదులుగా మారడం, వారసుడు రాజకీయాల్లో అంతగా రాణించలేకపోవడం, వయస్సు మీదపడుతుంటంతో సోమిరెడ్డి రాజకీయ మనుగడ ప్రశార్థకమవుతోంది. మరో ఐదేళ్ల పాటూ ప్రతిపక్షం ఉండక తప్పని పరిస్థితి నెలకొనడం, నియోజకర్గంలో టిడిపిని కాపాడే పెనుసవాల్ ముందు ఉండటం వంటివి ఇప్పుడు సోమిరెడ్డి ముందున్న విపత్కర పరిస్థితులు. మరి ఇటువంటి సమయంలో సోమిరెడ్డి ఏ విధంగా రాజకీయ అడుగు వేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఐదేళ్లు ప్రతిపక్షహోదాలో సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళుతూ, తన వారసుడి రాజకీయ భవితవ్యాన్ని ఆయన తీర్చిదిద్దుతారా లేక సోమిరెడ్డితోనే ఆ కుటుంబం నుంచి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది ఎవరి ఊహకూ అందడం లేదు.