క్షణాలు, నిమిషాలు, గంటలు... రోజులు, నెలలు, సంవత్సరాలు.. కాలం గిర్రున తిరుగుతోంది.. క్యాలెండర్ మారిపోతోంది. మరి క్యాలెండర్ కథేంటి?
జనవరి ఫస్ట్ తారీఖునే కొత్త సంవత్సరమని సంబరాలు ఎందుకు చేసుకుంటారు.? అసలు సంవత్సరాన్ని లెక్కించే ప్రమాణం ఏంటి? క్యాలెండర్ కహాని తెలియాలంటే, కొన్ని శతాబ్దాలు వెనక్కివెళ్లాల్సిందే. కాలం వేసిన ముద్రలను పరిశీలించాల్సిందే.
చాలా మంది జనవరి ఒకటిన విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అభిమానంతో చెబుతారు. ఆనందాన్ని పంచుకుంటారు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు.
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్
ఇదంతా తప్పులతడక, లోపాల పుడక అంటారు తెలుగు చరిత్రకారులు. క్రీశ 1582లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ప్రకారం మనం 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నామట .
ఫ్రాన్స్‌లో క్రీస్తుశకం 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీస్తుశకం 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతుంది.
కాలగమనంలో ఇది ఏప్రిల్‌కు మారింది.
నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా, ఏప్రిల్‌లో ఉంచాలా అన్న సందేహానికి ఫ్రాన్స్‌రాజు చార్లెస్.... అంతవరకూ 11వ నెలగా ఉన్న జనవరిని ఒకటవ నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడట. అలా కొత్త సంవత్సరం జనవరిలో, ఆనెల 1వ తేదీ నూతన ఏడాదిగా చెప్పుకుంటున్నాం.
భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. మన దినచర్య సూర్యోదయంతో మొదలవుతుంది.. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి మొదలవుతుంది.. అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది.
సృష్టిలో ఏ ప్రాణి అయినా ఉదయమే నిద్ర లేస్తుంది. పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేవి.. తోటల్లో పూవులు వికసించేవి.. ఆవులు దూడలకు పాలిచ్చేవి... ఇవన్నీ ఉదయమే జరుగుతాయి. అందుకే జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవంటారు మన చరిత్రకారులు. స్పష్టమైన కాలగణన ఉన్న భారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శమంటారు. అందుకే జనవరి 1ని క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలే కానీ కొత్త సంవత్సరంగా భావించొద్దన్నది మరికొందరు అభిప్రాయం.