సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో ఘట్టం క్లోస్

Update: 2019-04-18 15:43 GMT

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో ఘట్టం ముగిసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 61.88 శాతం పోలింగ్ నమోదైంది. ఒడిశాలో ఎన్నికల అధికారి హత్య పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో అల్లరిమూకల అఘాయిత్యాలు, అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. మొత్తం 11 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తమైంది.

కర్ణాటకలో 14, చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపీలో 8, అసోం, బీహార్, ఒడిశాలో ఐదుచోట్ల, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్ముకశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్, త్రిపులో ఒక్కోచోట పోలింగ్ జరిగింది. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉంటే 8 కీలక స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

రెండో దశ ఎన్నికల్లో మొత్తం 95 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించింది ఈసీ. ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పాటు 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జువల్‌ ఓరమ్, సదానంద గౌడ, పొన్‌ రాధాకృష్ణ సహా, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, డీఎంకే నేత దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం తమిళనాడులోని 39 చోట్ల ఓటింగ్‌ జరగాల్సింది. కానీ, డీఎంకే సంబంధీకుల వద్ద భారీ మొత్తంలో నగదు దొరకడంతో వేలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. సరైన శాంతిభద్రతలు లేకపోవడంతో త్రిపుర ఈస్ట్ స్థానానికి పోలింగ్‌ను మూడో దశలో అంటే ఏప్రిల్‌ 23న నిర్వహించనున్నారు. ఒడిషాలోని కంధమాల్‌ జిల్లా ఫుల్బనీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిబ్బందితో కలసి పోలింగ్‌ బూత్‌కు వెళ్తున్న ఎన్నికల అధికారిణిని మావోలు కాల్చి చంపారు. 

Similar News