మధ్య ప్రదేశ్ భోపాల్ లో నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. హిందూ ఓట్లకు గాలమేస్తున్న సాధ్వి ప్రగ్యా నామినేషన్ పేరుతో రెండు రోజుల పాటూ నానా హంగామా చేశారు. హై టెన్షన్ కాంపెయినింగ్ సాగుతున్న భోపాల్ లో సీన్ ఇప్పుడు చూద్దాం. ఇదేదో పెళ్లి ఊరేగింపు అనుకుంటున్నారా? కాషాయ దుస్తులు ధరించిన సన్యాసులు పెళ్లెందుకు చేసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారా? కంగారు పడకండి ఇది మధ్య ప్రదేశ్ లోని భోపాల్ ఎంపీ నియోజక వర్గానికి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన దిగ్రేట్ సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ రోడ్ షో.
మహారాణిలా పల్లకీలో ఊరేగిన ప్రగ్యా భారీ రోడ్ షో నిర్వహించింది. దారి పొడవునా బీజేపీ కార్యకర్తలు ఆమెకు సలాం చేస్తూ నినాదాలిస్తూ నడిచారు. వాస్తవానికి నామినేషన్లకు చివరి రోజైన మంగళవారం ప్రగ్యా తన నామినేషన్ వేయాల్సి ఉండగా సెంటిమెంట్, ముహూర్త బలం చూసుకుని ఒకరోజు ముందే అంటే సోమవారమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. పురోహితులు మంత్రాలు చదువుతుండగా ప్రగ్యాసింగ్ కలెక్టర్ కార్యాలయం ముందు నామినేషన్ పత్రాలతో నిలబడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ మౌనవ్రతం కూడా పాటించారు. ఆపై నామినేషన్ దాఖలు చేశారు. ఇక మంగళవారం బీ ఫామ్ పట్టుకుని పల్లకీలో ఊరేగారు.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటరాగా ఆమె ఒక మహారాణిలా తరలి వచ్చారు. ప్రగ్యా వెంట సాధువులు, హిందూ భక్తు సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఆరోగ్యం బాగోలేక ఆమె వీల్ ఛైర్ లోనే కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పైనా , తనను విమర్శించే వారిపైనా ఒంటికాలిపై లేస్తున్న ప్రగ్యా ఎన్నికల కోడ్ ను పదే పదే ఉల్లంఘిస్తూ అభ్యంతరకంగా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. మాలేగావ్ కేసులో జైలులో తనను చిత్రహింసలు పెట్టారంటూ సానుభూతి ఓట్లకోసం ప్రయత్నిస్తున్నారు. ప్రగ్యాకు ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ కూడా మైనారిటీ ఓట్లపై కన్నేశారు. ఆయన మసీదులు, చర్చిలు తిరుగుతూ, ప్రార్ధనలు చేస్తూ ఓట్ల అభ్యర్ధిస్తున్నారు. అభివృద్ధే ఎజెండాగా ప్రచారం చేస్తున్న దిగ్విజయ్ సింగ్ విజన్ ఫర్ భోపాల్ పేరుతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు.