మతాలు, ఆచారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఆడే డ్రామాలు సామాన్య జనానికేం అర్థంకావు. మనోభావాలకు మంటపెడుతూ, ఓట్ల పోలరైజేషన్‌కు, పార్టీల కుయుక్తులు అర్థంకావు. అయోధ్య రామమందిరం, ట్రిపుల్ తలాఖ్, తాజాగా శబరిమలం ఆలయంపై పొలిటికల్ పార్టీల స్టంట్లు, ప్రమాదకర క్రీడను పెంచిపోషిస్తున్నాయి. ఇందులో మొదట బోనులో ఎక్కాల్సింది బీజేపీ. ట్రిపుల్ తలాఖ్‌పై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతటి సాహసోపేత అడుగులు వేసిందో దేశమంతా చూసింది. ఇది మా మతం, మా సంప్రదాయమని ముస్లిం సంఘాలు అంటున్నా, మహిళల పట్ల దారుణ ఆచారమని ఖండించింది. సాక్షాత్తు కోర్టులోనూ ఇదే తమ స్టాండ్ అని ధైర్యంగా చెప్పింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. లోక్‌సభలో ఆమోదింపజేసుకుంది.
ముస్లిం మహిళల, ఉదారవాదుల, అభ్యుదయవాదుల జేజేలు అందుకుంది. కానీ శబరిమల విషయంలో అవే కోర్టు ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించి, రాజకీయ బుద్దిని ప్రదర్శించుకుంది.
శబరిమల తీర్పుపై కేరళ బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది. శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి, యథాతథ పరిస్థితి కొనసాగించాలట. లేదా ఆ తీర్పును తోసిరాజంటూ ఆర్డినెన్సు తేవాలట. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా, తలాక్‌తో శబరిమలను పోల్చలేమన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు, మరికొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం ఉండదని, ఆచారాలను గౌరవించాలన్నట్టుగా మొన్నటి ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమిత్ షా కేరళవెళ్లి, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కోర్టు ఆదేశాలను మన్నించడం ద్వారా కేరళ ప్రభుత్వం భక్తులను కష్టపెడుతోందని వ్యాఖ్యానించి వెళ్లాడు. రాజ్యాంగవాదులు దేవుడి కంటె కోర్టు ఎక్కువనుకుంటున్నారని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న కారణంతో, ఇరకాటంలో పడ్డ కేరళ ప్రభుత్వాన్ని మరింత కార్నర్ చేసేందుకు, రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.
ఉప్పూ, నిప్పూగా ఉండే బిజెపి, కాంగ్రెసు, కేరళలో ఈ విషయంలో ఒక్కటై ఉమ్మడి శత్రువైన సిపిఎం ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టాయి. నాస్తిక ప్రభుత్వం భక్తుల మధ్య వైరం పెంచుతోందని విజయన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ ప్రభుత్వం మాత్రం 'మేం తీర్పు అమలు చేస్తున్నాం, వెళదామనుకున్నవాళ్లకి రక్షణ కల్పిస్తాం' అంటోంది. ఇలా శబరిమల విషయంలో ఏ పార్టీకా పార్టీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీస్తున్నాయి. భక్తులతో చర్చించి, సామరస్యపూర్వకమైన వాతావరణం కల్పించాలి. ఆలయ ప్రతిష్టను కాపాడుతూనే, ప్రజలకే ఆ నిర్ణయం వదిలేయాలి. ఆలయ పవిత్రను కాపాడేలా వ్యవహరించాలి. కానీ అలా చేస్తే, రాజకీయ పార్టీలు ఎందుకవుతాయి. మరింత మంటపెట్టేలా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశాన్ని రచ్చరచ్చ చేస్తున్నాయి. సంప్రదాయాలు, సమానత్వం మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణను మరింత పెంచిపోషిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. పునాదులను పటిష్టం చేసుకుంటున్నాయి.