భక్తికి, మనోభావానికి హక్కులకు మధ్య రేగుతున్న ఈ యుద్ధం రకరకాల కొత్త సమస్యలను తీసుకొస్తోందా? దైవ దర్శనానికి లింగ బేధం లేదని కోర్టు చెప్పిన తీర్పును ఆధారంగా చేసుకుని కేరళ లో పినరయి సర్కార్ చెలరేగిపోయింది. భక్తులకు రక్షణ కల్పించే పేరుతో శబరి గిరి కొండలను పోలీసు మయం చేసేసింది. స్వామి దర్శనానికి మహిళలను అనుమతిస్తే, ఆత్మ హత్యలు చేసుకుంటామని ఓవైపు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు ఉద్యమాలకు దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయినా.. కేరళ పోలీసులు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా మహిళలను జీపుల్లో ఎక్కించుకుని సన్నిధానం దగ్గర వదులుతుండటం అయ్యప్ప భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే తమ కర్తవ్యమంటుంది కేరళ సర్కార్.. దేవుడిపై భక్తితో అన్ని నియమాలను నిష్టతో పాటించి తాము దర్శించుకుం టుంటే, ఏ మాత్రం భక్తి లేని వారు నాస్తికులు, హేతువాదులు, హిందూ ముసుగులో ఉన్న అన్యమతస్థులు ఆలయంలోకి వస్తున్నారంటూ అయ్యప్ప భక్తులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.. కేరళ అట్టుడుకుతోంది.. పవిత్రమైన ఆలయంలో ఈ యుద్ధ వాతావరణం ఎన్నాళ్లు? ఇప్పటి వరకూ 51 మంది మహిళలు ఆలయ ప్రవేశం చేశారని కేరళ సర్కార్ చెబుతోంది. వీరందరూ ధైర్యంగా, క్యూ లైన్ లో నిలబడి నిర్భయంగా దర్శించుకున్న వారు కారు.. అందరూ ఏదో ఓ ముసుగులో, ఏదో ఓ రూపంలో లోపలకి వెళ్లిన వారే.. దైవ దర్శనాన్ని అంత హడావుడిగా, భయం భయంగా చేసుకోవాల్సిన అవసరముందా. మారు వేషాల్లో వెళ్లి దర్శించుకుని రావడం రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడం అవుతుందేమో కానీ... నైతిక విజయం మాత్రం కాదు.. ఇది ఒక విశ్వాసానికి, హక్కుకు మధ్య రేగిన యుద్ధం.. దీనిపై ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరించాలి.. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళలోనే దేవుడి దర్శనం విషయంలో హింస చెలరేగితే అంతకన్నా అర్ధరహితం మరోటి ఉండదు.. అటు కేరళ సర్కార్, ఇటు అయ్యప్ప పరిరక్షణ సమితి మధ్య ఈ యుద్ధం ఎన్నాళ్లు? ఆలయాన్ని దేవుడిని రాజకీయాలకు అతీతంగా చూడగలిగిన నాడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
భక్తి ప్రధానమైనప్పుడు, దైవ దర్శనమే ధ్యేయమైనప్పుడు శబరిమలకే వెళ్లాలన్న పట్టుదలలో అర్ధం లేదు. కేరళ వ్యాప్తంగా చాలా అయ్యప్ప ఆలయాలున్నాయి.. హక్కును రక్షించుకోవాలనుకునే మహిళలు ఆ ఆలయాలలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.కానీ శబరిమల కొండకే వస్తామనడం వివక్షను పారదోలే ప్రయత్నంగా హేతువాదులు చూస్తున్నా, సనాతన వాదులు ఈ పంతం పట్ల రగిలిపోతున్నారు. ఇక అన్ని వయసులలో మహిళల ప్రవేశం నిషిద్ధం అంటున్న అయ్యప్ప భక్త సంఘాలు.. ఇప్పటికే 51 మంది దర్శించుకున్న తర్వాత ఇంకా ఆ నిబంధనలు పాటించడం అర్ధరహితమే అవుతుంది. ఆలయాన్ని శుద్ధి చేయడం, సంప్రోక్షణ చేయడం లాంటి చర్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తాయి. రెండు వైపులా పట్టుదలలు, పంతాలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. సున్నితమైన ఈ వివాదాన్ని రెండు వర్గాలు కలసి కూర్చుని చర్చించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. పవిత్రాలయాన్ని ఆలయంగా చూస్తే గొడవలుండవు. కానీ రాజకీయ కోణంలోంచి చూసినప్పుడే అసలు సమస్య..
ఏ సమస్యకైనా రెండు వైపుల వాదనలూ విన్నప్పుడే పరిష్కారం.. సమాజానికి జరుగుతున్న నష్టం భౌతికమైనది, ఆర్థికమైనది, సామాజికమైనది అయితే పరిష్కారానికి ఏదో మార్గం దొరుకుతుంది. కానీ ఇది విశ్వాసాలకు సంబంధించినది.. కంటికి కనిపించని ఈ నమ్మకాలపై సాగే యుద్ధానికి ముగింపు అసలు దొరుకుతుందా? దీనికి సమాధానం చెప్పేది కాలమొక్కటే.