సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి...మరి వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోడీ సర్కారు, అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? వర్మ అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చు...అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రాఫెల్ జెట్స్ కొనుగోలు స్కాం, ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే, ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి?
2017, ఫిబ్రవరి ఒకటిన రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్‌గా నియమిస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకుని, గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ అధికారిని నియమించారు. అస్థానాపై అప్పటికే అనేక ఆరోపణలున్నాయి. స్టెరిలైట్ కేసు, తాజాగా వర్మ ఆరోపించిన మొయిన్ ఖురేషి కేసులో నిందితుడైన సానా సతీశ్ నుంచి అస్థానాకు రూ.3 కోట్లు లంచం తీసుకున్నాడన్న కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. విచారణ జరుగుతున్న టైంలోనే ఆయనను స్పెషల్ డైరెక్టర్‌గా నియమించుకున్నారు మోడీ. ఆస్థానా నియామకాన్ని గట్టిగా వ్యతిరేకించారు వర్మ. ఇదే నేపథ్యంలో ఆస్థానాపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్‌గా విచారణకు ఆదేశించారు. అక్కడితో వివాదం మరింత ముదిరి, ఇద్దరి మధ్యా ప్రచ్చన్న యుద్ధానికి దారి తీసింది.
రాకేష్ అస్థానా. 1984, గుజరాత్ క్యాడర్ ఐపీఎస్. 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోడీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా 'సూపర్‌కాప్'గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోడీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది.