సార్వత్రిక ఎన్నికలు ఇందిర కోడళ్ల మధ్య దూరాన్ని, వైరాన్ని మరింత పెంచుతున్నాయా? తన బావగారి కొడుకు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసి మేనక ఒక్కసారిగా చెలరేగిపోయారు. రాహుల్ ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రధాని అయ్యే ఛాన్సే లేదని తీసిపారేశారు.సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీని పెంచడమే కాదు దశాబ్దాలుగా ఇందిర కోడళ్ల మధ్య వైరాన్ని కూడా ఏటేటా పెంచుతున్నాయి. సంజయ్ మరణానంతరం ఇందిర మేనకను బయటకు పంపేసిన నాటినుంచి ఇద్దరు కోడళ్ల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణమే కనిపిస్తోంది. సభలు, సమావేశాల్లో ఎదురు పడినా ముఖమిచ్చి పలకరించుకునే వాతవరణం కూడా లేదు.. బద్ధ శత్రువుల్లానే మేనక, సోనియా మిగిలిపోయారు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒకరినొకరు హద్దులు దాటి విమర్శించుకున్నది పెద్దగా లేదు. కానీ 2019 ఎన్నికలు ఆ హద్దును చెరిపేశాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన పిన్నమ్మ, సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ చెలరేగిపోయారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప రాహుల్ ప్రధాని కావడం అసాధ్యమన్నారు. రాహుల్ కి అంత సీన్ లేదని తేల్చేశారు. ఏ అభ్యర్ధయినా రెండు చోట్ల నుంచి పోటీ చేయచ్చని రాహుల్ వయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగడంలో తప్పేం లేదని అన్నారు. ఇక ప్రియాంక పై కూడా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రియాంకా గాంధీ ప్రభావం కాంగ్రెస్ కు ఎంత మాత్రం ఉపయోగపడదని ఆమె వెంట కార్యకర్తలే లేరని అన్నారు. సుల్తాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మేనక తన గెలుపు సునాయాసమని ధీమా వ్యక్తం చేశారు. సుల్తాన్ పూర్ నుంచి సంజయ్ రెండు సార్లు , కొడుకు వరుణ్ ఒకసారి గెలిచారని గుర్తు చేశారు. ఈసారి తాను గట్టిగా ప్రచారం చేసినట్లు, కార్యకర్తలు కూడా శ్రమిస్తున్నారనీ మేనకాగాంధీ చెప్పారు.
మహా ఘట్ బంధన్ కూటమి తననేం చేయలేదని, తాను గెలిచేసినట్లేననీ అన్నారు. బీఎస్పీ అభ్యర్ధులకు మాయావతి టిక్కెట్లు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. సుల్తాన్ పూర్ నియోజక వర్గం టిక్కెట్ ను కూడా 15 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.రాహుల్, ఆయన బావ రాబర్ట్ వాద్రా ఇద్దరూ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు.బీజేపీకి గతంలోకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు మేనక.