ఆటన్నాక కొంచెం థ్రిల్ ఉండటం సహజం.. కానీ పబ్జీ గేమ్ థ్రిల్ తో పాటూ మనిషిలో కిల్లర్ ఇన్ స్టింక్ట్ ని కూడా ప్రేరేపిస్తుంది. ఓడిన ప్రతీసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో మళ్లీ మళ్లీ ఆడుతుంటారు.. చూపు మార్చినా, పక్కకు చూసినా గేమ్ పై పట్టు పోతుందేమోనని చుట్టు పక్కల పట్టించుకోరు.పబ్జీ ఆడేవారిలో చదువుపై ఏకాగ్రత ఉండదు. కోపం, చిరాకు, అసహనం, కనిపించని ఒత్తిడి వెంటాడుతుంటాయి. నిరంతరం ఒక విధమైన ఆందోళన, ఒంటరిగా ఉండాలన్న భావన వెంటాడుతుంది. దూకుడు స్వభావంతో కసితో అక్కసుతో కనిపిస్తుంటారు. గేమ్ కి పూర్తిగా బానిసలైన వారిలో మతిభ్రమణం, లేనివి ఉన్నట్లుగా ఊహించుకోడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
గంటల తరబడి మొబైల్ లో మునిగి తేలడం వల్ల నిద్రలేమి, కంటి జబ్బులు తలెత్తుతాయి. చుట్ట పక్కల మనుషులతో సంబంధాలు తెగిపోయి డిప్రెషన్ కు దారి తీస్తుంది. అది క్రమేణా సూసైడ్ కి దారి తీసినా ఆశ్చర్యపోనక్కర లేదు. పబ్జీ లాంటి గేమ్స్ పిల్లల మొబైల్ లో లేకుండా జాగ్రత్త పడటం ఒక్కటే మన ముందున్న మార్గం.. పిల్లలపై తల్లి దండ్రుల నిరంతర పర్యవేక్షణ చాలా అవసరం.. పట్టించుకోకుండా వదిలేస్తే.. రేపు అది వారి జీవిత సమస్యగా మారే ప్రమాదముంది. ప్రాణాలనూ బలి తీసుకుంటుంది. కాబట్టి ఈ భయంకరమైన గేమ్ కి పిల్లలు ఎడిక్ట్ కాకుండా చూడాలి. పోకేమాన్, బ్లూవేల్ గేమ్స్ కలిగించిన నష్టాన్ని మరువక ముందే పబ్జీ తయారైంది. వీడియో గేమింగ్ కంపెనీలకు లాభాపేక్ష తప్ప అది సమాజంపై కలిగిస్తున్న నష్టంతో సంబంధం ఉండదు.. ఇప్పటికే చైనా ఈ గేమ్ ను నిషేధించింది. మన దేశంలో కూడా ఈజాడ్యం మరింత బలపడకముందే గేమ్ ను నిషేధిస్తే మంచిది.