పాలమూరు కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

Update: 2019-07-19 04:40 GMT

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఏటికి ఎదురీదుతోంది కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో, ఇప్పుడు నాయకత్వ కొరత కొట్టోచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కారణం అనే కన్నా కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణంగా చెప్పకతప్పదు. కొన్నేళ్లపాటు జైపాల్ రెడ్డి, డికే వర్గం అన్నట్టుగా కొనగిన పార్టీ చివరకు ఆ వర్గ పోరులో డికే అరుణ పార్టీనే వీడారు. వర్గపోరు ముగిసింది. మరి పార్టీని ముందుండి నడపాల్సిన జైపాల్ రెడ్డి, ఆయన వర్గం ఏం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతవరకు అండగా ఉన్నారు? జిల్లాలో పార్టీ ఉనికే ప్రమాదంలో ఎందుకు పడుతోంది?

ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో  కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగువెలిగింది. ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఒక కేంద్రమంత్రి అయ్యారు. ఇక పలువురు నేతలు కూడా జాతీయ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే ఏటికి ఎదురీదుతున్న పరిస్థితి. జాతీయ స్థాయి నాయకులున్నా కనీసం కార్యకర్తలను కాపాడుకోలేక, వారిలో భరోసా నింపలేని నిస్సహాయ స్థితిలో జిల్లా కాంగ్రెస్ నాయకులున్నారు. పార్టీ బలంగా ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, డికె అరుణ వర్గాల మద్య జరిగిన వర్గపోరు చివరకు ఆ పార్టీ మూలాలనే చిదిమేసింది. ఈ వర్గపోరు భరించలేక చివరకు సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డికే అరుణ పార్టీనే వీడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఆమె పార్టీలో లేనేలేరు. ఆమే పార్టీ మారడంతో వర్గపోరు సైతం కనుమరుగైంది. ఇలాంటప్పుడు పార్టీని దగ్గరుండి నడిపించాల్సిన బాధ్యతను ఎవరు తీసుకోవాలి, అంటే కచ్చితంగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనే పేరు వినిపిస్తుంది.

కానీ ఆయన పార్టీకి ఏనాడూ ఉపయోగపడ్డ పాపాన పోలేదన్నది జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం. ఆయన ఎప్పుడూ కూడా ఎన్నికలకు ముందు వచ్చి గ్రూపు రాజకీయాలు చేశారే తప్ప, పార్టీని బతికించిన దాఖలాలు లేవని, పార్టీ కోసం పనిచేసిన సందర్భంలేదన్నది జిల్లా నేతల ఆరోపణ. ఈ నేపథ్యమే ఆయనకు, కార్యకర్తలను దూరం చేసిందని చెప్పక తప్పదు. ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల అనంతరం ఒక్క రంజాన్ పండగకు మినహా ఆయన జిల్లా వైపు తిరిగి చూడలేదని కార్యకర్తలు రగిలిపోతున్నారు. జైపాల్ రెడ్డి తీరు ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులు సంపత్ కుమార్, వంశీచంద్‌ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, మల్లురవి లాంటివారు కూడా పార్టీని బలోపేతం చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నారు. వీరు ప్రస్తుతం కార్యకర్తల మధ్య తిరగలేని దుస్థితిలో ఉన్నారు. కొడుకు మరణంతో నాగం దాదాపు రాజకీయాలకు స్వస్తి పలుకుతారన్న ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటి చేసి, ఓటమి చెందిన తర్వాత నాగం పూర్తిగా చతికిలపడ్డారు.

ఇటు సంపత్ కుమార్ సైతం అలంపూర్ నుంచి ఓటమి చెందడంతో ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదన్న పుకార్లు వినిపిస్తున్నాయి. సంపత్ ఏఐసిసి కార్యదర్శి కావడంతో ఆయన ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీచంద్‌ రెడ్డి సైతం అదే తీరులో కొనసాగుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఓటమితో, పాలమూరు ఎంపిగా పోటీచేసిన వంశీ చంద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసితీరుతానంటూ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు హామి ఇచ్చారు. చివరకు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మహబూబ్‌ నగర్‌కే కాదు, జిల్లాలో ఎక్కడ కూడా కనిపించడం లేదన్నది కార్యకర్తల కంప్లైంట్. జిల్లాలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు, ఇప్పటికీ పరిహారం విషయంలో నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వారికి మద్దతు నిలవాల్సిన కాంగ్రెస్ నాయకులు మాత్రం వారి గోడును పట్టించుకోలేదు. ఒక్క చిన్నారెడ్డి మినహా మరెవ్వరూ కూడా నిర్వాసితులవైపు కన్నెత్తికూడా చూడలేదు.

ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారడంతో బీజేపి పార్టీ చాపకింద నీరులా గ్రామగ్రామాన విస్తరించే వ్యూహాలకు పదునుపెడుతోంది. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న ప్రచారంతో కాషాయ నేతలు పార్టీని బలోపేతం చేస్తున్నారు. సభ్యత్వ నమోదులోను కమలం పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొంటూ, జిల్లాలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. మరో జాతీయ పార్టీ తమ పార్టీని రీప్లేస్ చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నా, పాలమూరులో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌ మాత్రం, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం, కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, పార్టీలో పునరుత్తేజం నింపేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. 

Full View


Tags:    

Similar News