హిందూ సెంటిమెంట్లకు కాంగ్రెస్ వలేస్తోంది. రాహుల్ ఆలయాల సందర్శన మార్గంలోనే సోదరి ప్రియాంక కూడా పయనిస్తున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి హిందూ దైవాలనే నమ్ముకుంటున్నారు. అంతేకాదు బోటు ర్యాలీ ద్వారా ఆలయాలను సందర్శిస్తూ, ప్రజలను కలవడం వల్ల పుణ్యం, పురుషార్ధం రెండూ దక్కుతాయని ఆమె భావిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ తురుపుముక్క ప్రియాంకా గాంధీని రంగంలోకి దించింది. గెలుపుకు మలుపు చూపే ఉత్తర ప్రదేశ్ పై కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. హిందూ ఓటర్ల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే విధంగా ముడు రోజల పాటూ బోట్ ర్యాలీని నిర్వహిస్తోంది. ప్రయాగ్ రాజ్ నుంచి మోడీ నియోజక వర్గమైన వారణాసి వరకూ ప్రియాంక బోటు ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల18 నుంచి 20వ తేదీ వరకూ ఆమె ఈర్యాలీలో పాల్గొంటారు.
ప్రియాంక ఈ ర్యాలీని సంగం నుంచి స్టీమర్ బోటులో మొదలు పెడతారు. అక్కడ దైవ దర్శనం చేసుకుని అక్కడ నుంచి వారణాసికి వెళ్లే దారిలో ఉన్న ఆలయాలన్నీ దర్శించుకుంటారు. మీర్చాపూర్,సీతామణి, సిర్సాల మీదుగా ప్రయాణిస్తూ గంగా నది ఒడ్డున ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ 20వ తేదీకి వారణాసి చేరుకుంటారు. అక్కడ కాశీ విశ్వేశ్వరుడు,షీట్లా ఆలయాల దర్శనం చేసుకుని ఆ తర్వాత దశాశ్వ మేధ ఘాట్, అస్సీ ఘాట్ లకు చేరుకుంటారు. అక్కడి స్థానికులు, ప్రజలతో మమేకమవుతారు.. పార్టీ కార్యకర్తలను కలుస్తారు.
అయితే ప్రియాంక బోట్ జర్నీప బీజేపీ అప్పుడే సెటైర్లు పండిస్తోంది. మోడీ గంగానదిని శుభ్రపరచడం వల్లనే ప్రియాంక ఈరోజు బోటు యాత్ర చేయగలుగుతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టింది.అర్ధ కుంభ మేళా జరిగినప్పుడు ప్రియాంక గానీ, ఆమె సోదరుడు రాహుల్ గానీ సంగం ను సందర్శించలేదని ఇవాళ ఓట్ల కోసం మాత్రం వస్తున్నారనీ బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ప్రయాగ రాజ్ సందర్శిస్తున్న ప్రియాంక తన తాత ఫిరోజ్ గాంధీ సమాధిని సందర్శిస్తారో లేదో చూడాలని బీజేపీ అంటోంది. హోలీ శెలవులు చూసుకుని మరీ యాత్ర చేపడుతున్నారని, శెలవుల వల్ల ఎక్కువ మంది జనాలు తన యాత్ర చూసేందుకు వస్తారని ప్రియాంక ప్లాన్ వేశారని బీజేపీ ఆరోపిస్తోంది.