యుద్ధ భూమి యూపీలో గెలుపెవరిది? మైనారిటీ మంత్రాన్ని పక్కన పెట్టి హిందూ సెంటిమెంట్ తో అడుగులేస్తున్న కాంగ్రెస్.. తమ స్టార్ కాంపెయినర్ ప్రియాంకతో యాత్రలకు శ్రీకారం చుట్టింది. అయోధ్య వీధుల్లో ప్రియాంకకు అద్భుతమైన ఆదరణ కనిపించింది. ప్రియాంక వారణాసి టూర్ కాంగ్రెస్ వరస మార్చేస్తుందా?
యుద్ధభూమి యూపీని గెలవడానికి కాంగ్రెస్ సరికొత్త గేమ్ ప్లాన్ తో దూసుకుపోతోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ పట్టును పూర్తిగా తొలగించలేని స్థితిలో ఉన్నా కాంగ్రెస్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెడుతోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రియాంకను రంగంలోకి దించడంతో యూపీ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.
ప్రియాంక వస్తూనే.. పార్టీ శ్రేణులకు జోష్ తీసుకొచ్చారు.. కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ప్రధాని మోడీపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. స్కూలు విద్యార్ధులు, కాలేజీ యువత, నిరుద్యోగులు, మహిళలు, చేతి వృత్తుల వారు, ఇతర రంగాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రేమ కనపరుస్తూ ముందుకు సాగుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును పదిల పరుచుకుంటూ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. 80 ఎంపీ సీట్లున్న యూపీలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కాంగ్రెస్ చెమటలు కక్కుతోంది.
స్టార్ కాంపెయినర్ ప్రియాంక గాంధీని రంగంలోకి దించడమే కాదు.. తమ మైనారిటీ మంత్రాన్ని పక్కన పెట్టి.. సున్నితమైన హిందూ సెంటిమెంట్ ను జపిస్తోంది. ప్రియాంక గంగా యాత్ర ఆ ఉద్దేశంతో ప్లాన్ చేసినదే. మూడు రోజుల పాటూ ఆలయాలు సందర్శిస్తూ గంగానదీ తీరప్రాంతంలో ఉన్న ఓటర్లను కలుసుకుంటూ ప్రియాంక పర్యటన సాగిపోయింది. దాదాపు140 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ చెప్పుకోదగ్గ రీతిలో పెరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి.
బలమైన మోడీ-యోగీ కాంబినేషన్ ను ఢీకొట్టడానికి అన్నా చెల్లెళ్లు ప్రియాంక, రాహుల్ చెమటోడుస్తున్నారు. గంగా యాత్ర తర్వాత అయోధ్యకు రైలు యాత్ర చేస్తున్న ప్రియాంక దారి పొడవునా అభిమానులను కలుసుకుంటున్నారు. యూపీ ఒక విచిత్రమైన ఎలక్షన్ గ్రౌండ్ ఎన్నో ఆలయాలకు తోడు వివాదాస్పద రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కువమంది హిందువులున్న ఈ రాష్ట్రంలో బీజేపీ గత ఎన్నికల్లో హిందూత్వ మంత్రం ప్రయోగించి 80 కి 71 సీట్లు గెలుచుకుంది. దాంతో కాంగ్రెస్ కూడా హిందూత్వ రాగాన్ని అందుకోక తప్పని పరిస్థితి.. అందుకే రాహుల్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసలైన హిందువునని చాటుకున్నారు శివ భక్తుడినని చెప్పుకున్నారు.
ఇప్పుడు తాజాగా ప్రియాంక తాను రామ భక్తురాలినని చెబుతున్నారు.. ప్రియాంక ఈ మాటలు అన్నారో లేదో తెలీదు కానీ ఆమె పేరున పెద్ద పెద్ద పోస్టర్లు మాత్రం వెలిశాయి.కైఫియత్ ఎక్స్ ప్రెస్ లో ఫైజాబాద్ చేరుకున్న ప్రియాంక అక్కడ నుంచి హనుమాన్ గిరి ఆలయం మీదుగా రోడ్ షో చేశారు. అక్కడ చిన్న చిన్న కూడళ్ల మీదుగా తన పరివారంతో పర్యటించారు. బిర్లా టెంపుల్ మీదుగా సాగిన రోడ్ షోలో స్కూలు విద్యార్ధులతో ముచ్చటించారు. కూడళ్లలో ప్రసంగాలు చేశారు. అక్కడి దుకాణదారులు, స్థానికులతో కలయతిరిగారు. వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు.
ప్రియాంక ఇలా రావడం స్థానికులను సమ్మోహితులను చేసింది. ఊహించని ఈ పర్యటనకు వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. గత 30 ఏళ్లలో ఏ కాంగ్రెస్ నేతా ఈ రాష్ట్రంలో ఇలా జనంతో మమేకమవలేదు.1986లో ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీ అయోధ్యలో శిలాన్యాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత యూపీలో కాంగ్రెస్ పెద్దగా ఉనికి చాటుకున్నది లేదు. అప్పటికి రెండు సీట్లు కలిగిన బీజేపీ కాలక్రమంలో కాంగ్రెస్ కు సరైన నేత లేకపోవడంతో 89 స్థానాలకు ఎదిగిపోయింది.
వారణాసిలో మోడీపై పోటీకి రెడీ అంటున్న ప్రియాంక.. రామ్ లల్లాను మాత్రం సందర్శించలేదు. రామాలయ నిర్మాణంపైనా మాట్లాడలేదు.. మరి ఈ హిందూ సెంటిమెంట్ యాత్ర పైపై ముసుగేనా?అటు బీజేపీని, ఇటు అఖిలేష్, మాయా కూటమిని బెదిరించడానికేనా? కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానికులతో సమావేశాలు జరిపారు. ఆలయాలను సందర్శించారు కానీ వివాదాస్పద రామజన్మభూమికి మాత్రం దూరంగా ఉన్నారు. అసలా విషయాన్నే ఎన్నికల్లో ప్రస్తావించలేదు. రామ మందిర సెంటిమెంట్ ను బాగా వాడుకునే ప్రధాని మోడీ తన అయిదేళ్ల పాలనలో ఒక్క సారికూడా అయోధ్యను సందర్శించలేదు.
ఇప్పుడు ప్రియాంక అయోధ్య యాత్ర ద్వారా హిందూ ఓట్లపై కాంగ్రెస్ పకడ్బందీ స్కెచ్ వేసింది. ప్రియాంక తన చరిష్మాతో స్థానికుల మనసు ఆకట్టుకున్నారు. కార్యకర్తలు ఆదేశిస్తే మోడీని ఢీకొనేందుకైనా సిద్ధమంటూ శ్రేణులకు ఉత్సాహాన్నందించారు. హిందూత్వ సెంటిమెంట్ ఉపయోగించుకోడం వరకూ ఓకే.. కానీ హిందువులకు తగిన హామీలు మాత్రం కాంగ్రెస్ ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చాక రామాలయం కడతామని బీజేపీ లాగా కాంగ్రెస్ మాత్రం కమిట్ కావడం లేదు. బీజేపీ ఇదే అంశాన్ని ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తే మాత్రం కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడటం ఖాయం.
యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమితో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిన కాంగ్రెస్ దానికి విరుగుడుగానే ప్రియాంకను తీసుకొచ్చింది. ముస్లింలు, దళితులు, ఓబీసీలు, అగ్రవర్ణ ఓటర్లు ఈసారి మహా ఘటబంధన్ వైపు చూస్తున్నారు.అటు బీజేపీ, ఇటు ఘట్ బంధన్ జోష్ ను కంట్రోల్ చేయడానికి ప్రియాంక సరిపోతారా? యూపీని గెలిస్తే, దేశాన్ని గెలిచినట్లే అన్న సూత్రీకరణలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ యూపీ, ఢిల్లీ, బెంగాల్ లలో ఆప్, తృణమూల్ లతో పొత్తు కుదుర్చుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదం.
మోడీ వైఫల్యాలపై ఎక్కు పెట్టడం ద్వారా కాంగ్రెస్ కు మంచి మార్కులు పడేలా ప్రియాంక బాగానే ప్రశ్నించారు. గాంగా నదిని శుద్ధి చేస్తామని చెప్పిన మోడీ ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అలాగే గోవుల పరిరక్షణ,జంతు సంరక్షణ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ప్రియాంక రాక కాంగ్రెస్ కి ప్లస్ గా మారినా..యూపీలో జరిగే మహా యుద్ధంలో కాంగ్రెస్ సోదిలోకి కూడా లేకుండా పోతుందని విశ్లేషకులంటున్నారు. కారణం ఈ సారి యుద్ధం బీజేపీ,ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీ కూటమి మధ్యనే ఉండబోతోంది. ప్రియాంక టూర్ యూపీలో కాంగ్రెస్ కి ఓ నాలుగైదు సీట్లు గెలుచుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుందా?