ప్రియాంకా గాంధీ పడవ ప్రయాణం.. గంగ గట్టున ఓట్ల వేట

Update: 2019-03-18 16:43 GMT

మోడీ టార్గెట్‌ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో గంగా యాత్ర‌'పేరుతో వినూత్నంగా బోటులో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. గంగానదిలో 140 కిలోమీటర్ల మేర సాగనున్న బోటు ప్రచారం ప్రధాని మోడీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ముగియనుంది.

''నేను కాపలాదారునే'' అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించిన ప్రచారంపై ఉత్తరప్రదేశ్-ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''ధనవంతులకే వాళ్లు కాపలాదారులు, రైతులకు కాదు'' అని ఆమె వ్యాఖ్యానించారు. 'గంగా యాత్ర‌'పేరుతో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రియాంక గాంధీ వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, యువకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనీ దీని వల్లే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొందని పేర్కొన్నారు.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రియాంక గాంధీ ప్రయాగరాజ్‌ వద్ద గంగానదిలో మూడురోజుల బోటుయాత్రను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగానదిలో 140 కిలోమీటర్లు బోటులో ప్రయాణించనున్న ఆమె ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో యాత్రను ముగించనున్నారు.

పవిత్ర గంగానదిలో సాగుతున్న బోటుయాత్రలో భాగంగా ప్రియాంక నదీపరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల వద్ద ఆగి.. వారిని పలకరిస్తూ.. వారితో 'బోటుపే చర్చ కార్యక్రమం నిర్వహిస్తూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బోటు ప్రయాణానికి ముందు ప్రియాంకా గాంధీ ప్రయాగరాజ్ వెళ్లారు. అక్కడి ప్రముఖ హనుమాన్ మందిరంలో పూజలు, అర్చనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్నారు . అప్పట్లో ప్రియాంక నాన్నమ్మ ఇందిరా గాంధీ కూడా ఇదే ఆలయంలో పూజలు చేశారు.

ముఖ్యంగా వెనకబడిన తరగతులు, షెడూల్డ్‌ కులాల ప్రజలతో మమేకమవుతూ వారిని కలుస్తూ ప్రియాంక ఈయాత్రలో ముందుకుసాగనున్నారు. తూర్పు యూపీలో ఈ రెండు సామాజికవర్గాలు ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వారిని ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో పూర్వవైభవాన్ని తీసుకురావాలని ప్రియాంక భావిస్తున్నారు.

Similar News