Political War Between Leaders: వనమా-జలగం మధ్య కుంపట్లేంటి?
Political War Between Leaders: నువ్వొకటి అంటే, నే రెండంటా. నువ్వు ఒక్క దెబ్బ వేస్తే, నే మూడేస్తా. ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్.
Political War Between Leaders: నువ్వొకటి అంటే, నే రెండంటా. నువ్వు ఒక్క దెబ్బ వేస్తే, నే మూడేస్తా. ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్..రా చూసుకుందాం. సినిమా డెలాగ్‌లను తలపిస్తున్నాయి కదా. అంతకుమించి అన్నట్టుగా ఖమ్మం గుమ్మంలో సీన్ సితారా క్రియేట్ చేస్తున్నారు కొందరు నాయకులు. పగలు, సెగలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని స్వయంగా అధిష్టానం రగిలిపోయినా, మేమంతే, మా తీరింతే అన్నట్టుగా, శివ సినిమాలో ముఠా గొడవల్లా రచ్చ చేసుకుంటున్నారు ఇద్దరు నాయకులు. ఇంతకీ వారి మధ్య ఎందుకీ రగడ?
ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం రాజకీయాల కథే వేరు. అధికార, పక్షాల మధ్య కాదు, స్వపక్షంలోనే విపక్షంలా కత్తులు దూసే నాయకులే ఎక్కువ ఇక్కడ. కొత్తగూడెం గులాబీ వనాన్ని నందనవనంగా చూసుకోవాల్సిన నేతలు, ప్రచ్చన్నయుద్ధంతో చిందరవందర చేస్తున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మధ్య పచ్చగడ్డి వేసినా, వెయ్యకున్నా భగ్గుమనే కోల్డ్‌వార్ నెలకొంది ఇక్కడ.
2019 ఎన్నికల అనంతర పరిణామాలతో కొత్తగూడెం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలింది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వనమా వెంకటేశ్వరరావు అనంతర రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరటంతో, కొత్తగూడెం రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు సైతం కొత్తగూడెం నియోజకవర్గంలో బలమైన క్యాడర్ వుంది. దీంతో కొంతకాంగా నెలకొన్న గ్రూపుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు బహిరంగ విమర్శలకు దిగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రగడ రగడ చేసుకుంటున్నాయి. ఫ్లెక్సీలతో మొదలైన వివాదం, మరిన్ని రగడలకు ఆజ్యంపోసింది.
ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ సుజాతనగర్ పర్యటనలో, స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు జలగం వర్గీయులు. వీటిని కొందరు రాత్రికి రాత్రే తొలగించారు. దీంతో కోల్డ్ వార్ గా వివాదం ముదిరింది. ఇదే తరుణంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవ ఫ్లెక్సీ, మరో వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో వనమా రాఘవ శాసనసభ్యుడు అంటూ ఉన్న ప్రింట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై ఇరువర్గాల మధ్య సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
వనమా వర్గం, జలగం అనుచరులు వివాదాస్పద రీతిలో పోస్టులు పెట్టారు. దీంతో జలగం అనుచరుడిపై నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వనమా అనుచరులు ఫిర్యాదులు చేశారు. ప్రతిగా జలగం వర్గం సైతం వనమా రాఘవ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకుంటున్నాడని పోలీసులకు కంప్లైంట్స్ చేశారు. అధిష్టానానికి కొత్తగూడెం పంచాయతీ చేరింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఇరువర్గాల మధ్య టికెట్ల సమస్య నెలకొనగా "బీ ఫాం" ల బాధ్యత వనమా వెంకటేశ్వ రావుకే లభించిచింది. దీంతో జలగం అభిమానులు రెబెల్స్ గా రంగంలోకి దిగారు.
కొంతమంది గెలుపొందారు. వనమా నేతృత్వంలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అప్పుడు సైతం అధిష్ఠానానికి ఫిర్యాదులందాయి. తాత్కాలికంగా గ్రూపుల గొడవ సద్దుమనిగింది. తిరిగి తాజాగా నెలకొన్న సమస్యపై అధిష్ఠానం దృష్టిసారించాలని సీనియర్ కార్యకర్తలు కోరుతున్నారు. గ్రూపు గొడవలతోనే ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయామని స్వయంగా సీఎం అన్నారు. అయినా నేతల్లో మార్పు రావడం లేదని, అనుచరుల ఆవేదన. వనమా, జలగం వర్గీయుల మధ్య రోజురోజుకు మండుతున్న కోల్డ్‌వార్‌ను, అధిష్టానమే చల్లార్చాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.