రాజీనామాపై కోనేరు ప్రదర్శించిన చాణక్యమేంటి?

Update: 2019-08-06 07:57 GMT

అటవీ అధికారులను కొట్టారు. పైగా విలువలకు కట్టుబడిన నాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు. రాజీనామా చేసి, ఇంటా బయటా వేడిని చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ రాజీనామా వెనక అసలు డ్రామా వేరే ఉందన్న విషయం, పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. రాజకీయ చాణక్యం ప్రదర్శించారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేత...రాజీనామా వెనక చాణక్యమేంటి?

కుమ్రంభీమ్ జిల్లాలో అటవీ అధికారులపై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూన్ 30న ఈ దాడి జరిగింది. దాడి జరిగి నెల రోజులు దాటింది. అటవీ అధికారి అనితపై దాడి చేసిన జడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ తీరును అందరూ ఖండించారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దాడి చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలొచ్చాయి. అటు పార్టీ పరంగా, ఇటు బయటా తీవ్ర విమర్శలు రావడంతో, కోనేరు క్రిష్ణ జడ్పీ వైస్ పదవికి, జడ్పీటీసీకి రాజీనామా లేఖను సమర్పించారు.

అయితే కోనేరు జోడు పదవులకు రాజీనామా చేసి నెల రోజులు దాటింది. కాని ఇప్పటి వరకు రాజీనామా ఆమోదం పొందకపోవడంపై జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది. ఎందుకు ఆమోదం పొందలేన్నదానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. రాజీనామా పత్రాన్ని క్రిష్ణ అనుచరులు కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్‌కు సమర్పించారు. అయినా రాజీనామా ఆమోదం పొందక పోవడం, ప్రజల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. కొందరు రాజీనామా చేశారని, మరికొందరు రాజీనామా చేయలేదని చర్చించుకుంటున్నారట.

క్రిష్ణపై టిఆర్‌ఎస్ పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో రాజీనామా చేశారని, కాని ఆమోదం పొందకుండా వ్యూహత్మకంగా వ్యవహరించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యూహంలో భాగంగా జడ్పీ సీఇఓకి ఇవ్వాల్సిన రాజీనామా లేఖను, కావాలనే కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్‌కు సమర్పించారన్న చర్చ జరుగుతోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే రాజీనామాలు చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అందుకే పదవి పోకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా రాజీనామాతో రాజకీయాలను రంజుగా నడిపారన్న టాక్ జిల్లాలో నడుస్తోంది.

పదవులను త్యాగం చేశారని ప్రజల్లో భారీగా సానుభూతి పెరిగిందట. క్రిష్ణ చాణక్యం గురించి రాజకీయ వర్గాలకు సైతం అంతుబట్టలేదట. దాడులు చేయడమే కాదు, పదవులు కాపాడుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారని ఆ పార్టీ నాయకులే బయట చెప్పుకుంటున్నారట. పైగా జైలు నుంచి వచ్చిన తర్వాత సైతం తమ నాయకుడికి పదవి ఏలే అవకాశం ఉందని ఆయన అనుచరులు బయట ప్రచారం చేసుకుంటున్నారు. రాజీనామాతో త్యాగపరుషుడిగా అవతారం ఎత్తిన క్రిష్ణ, అదే అస్త్రంతో బయట విమర్శలను, పార్టీ ఒత్తిడిని అధిగమించారట. అయితే అసలు నాటకం ప్రజలకు పూర్తిగా అర్థమైందని, కోనేరు క్రిష్ణకు ప్రజలే బుద్ది చెబుతారని ప్రత్యర్థి పార్టీల నాయకులంటున్నారు. చూడాలి రాజీనామా వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..

Full View

Tags:    

Similar News