చాయ్ వాలా గత ఎన్నికల సందర్భంగా మోడీ తనను తాను చాయ్ వాలాగా అభివర్ణించుకున్నారు. ఆ మాటనే తూటాలా పేలింది. ఓట్లు కురిపించింది. ఇప్పుడు మోడీ తనను తాను చౌకీదార్ అని అభివర్ణించుకుంటున్నారు. విపక్షం మాత్రం చౌకీదారే చోర్ గా మారాడని విమర్శిస్తోంది. అందుకు మోడీ కూడా దీటుగానే స్పందించారు. తాజాగా మై భీ చౌకీదార్ అంటూ ఆ పదంతో ఏకంగా ఎన్నికల ప్రచారమే ప్రారంభించారు. మరి చౌకీదార్ గా మారిన చాయ్ వాలా ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారా ? మై భీ చౌకీదార్ క్యాంపెయిన్ ఓట్లు కురిపిస్తుందా ? చౌకీదారే చోర్ అనే క్యాంపెయిన్ ను విపక్షం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా..?
రాజకీయాల్లో చోర్ అనగానే దేశంలో మధ్యవయస్సు వారందరికీ ఓ సంఘటన గుర్తుకువస్తుంది. 1988 మే 27న పాట్నా రేడియో స్టేషన్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. లైవ్ ట్రాన్స్ మిషన్ సందర్భంగా ఒక బాలికను ఏదైనా జోక్ చెప్పాల్సిందిగా అడిగారు. అందుకు ఆ అమ్మాయి గలీ గలీ మే షోర్ హై రాజీవ్ గాంధీ చోర్ హై అని చెప్పింది. అప్పట్లో బోఫోర్స్ శతఘ్నలపై ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు రాఫెల్ విమానాలపై అదే తరహా ఆరోపణలొస్తున్నాయి. అప్పట్లో రాజీవ్ గాంధీ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోయారు. మోడీ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. మరో వైపున గత కాలపు వివిధ కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాఫెల్ ఒప్పందంపై ఆరోపణలు చేయడం గురివిందగింజ తరహా అనే వారూ ఉన్నారు. మొత్తానికి రాఫెల్ వ్యవహారంలో చౌకీదార్ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ పదాన్ని పాజటివ్ అర్థంలో మొదట ఉపయోగించింది మోడీ అయినా చౌకీదారే చోర్ అంటూ రాహుల్ గాంధీ ఆ పదంతో నెగెటివ్ ప్రచారం బాగా చేశారు. ఆ నెగెటివ్ లో నుంచే మోడీ శనివారం నాడు మరో పాజటివ్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. అదే మై భీ చౌకీదార్. క్యాంపెయిన్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఇది దేశవ్యాప్తంగా అందరి నోళ్ళకూ చేరిపోయింది. ఇన్నాళ్ళుగా సరైన ఆకర్షణీయ నినాదం లేని బీజేపీకి ఇప్పుడు ఆ కొరత తీరినట్లుగానే ఉంది. రాహుల్ గాంధీ పుణ్యమా అంటూ మోడీ తాజాగా మై భీ చౌకీదార్ అనే నినాదం అందుకున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో భారీ యుద్ధానికి దారి తీసింది.