పవన్‌ మౌనం వ్యూహాత్మకమా...సాధారణమా?

Update: 2019-03-07 12:22 GMT

డేటాపై ఏపీలో మాటల యుద్ధం తీవ్రమవుతోంది. అతపెద్ద స్కామ్‌గా అధికార, విపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కానీ జనసైనికుడు మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు...ఏపీని కుదిపేస్తున్నా, తనకేమీ పట్టనట్టుగా ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పవన్‌ మౌనం వ్యూహాత్మకమా...సాధారణమా?

ఆంధ్రప్రదేశ్‌లో డేటా చోరి, ఓట్ల తొలగింపు అంశాలు, ఎన్నికల వేళ హీటెక్కిస్తున్నాయి. రెండు పార్టీల మధ్యే కాదు, రెండు రాష్ట్రాల మధ్యే చిచ్చు రేపుతున్నాయి. చంద్రబాబు, జగన్‌లు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరంటే మీరంటూ నిందలు వేసుకుంటున్నారు. జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సిట్‌ ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో డేటా కేసుపై ఇంత రచ్చ జరుగుతున్నా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం, ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరించడం, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా తన పార్టీ కార్యకలాపాలుపై దృష్టి పెట్టారు. జనసేనను బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పోరాట యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటించారు. అధికార ప్రతిపక్ష పార్టీల తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ కేంద్రంగా టీడీపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, దుర్వినియోగం చేయడంతో పాటు వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తోందని, వైసీపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్‌ సర్కార్‌తో కుమ్మక్కయి, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైసీీపీ తొలగిస్తోందని, దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా సహకరిస్తోందని, అటు తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఇలా రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో, మిగతా పార్టీ ఏదైనా ఈ రెండింటినీ విమర్శించి, రాజకీయ లబ్ది పొందాలనుకుంటుంది. కానీ జనసేన అధినేత పవన్ అలాంటివేమీ చేయడంలేదు. డేటా ఇష్యూను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. అటు టీడీపీని, ఇటు వైసీపీని పల్లెత్తు మాటా అనడం లేదు. ఇది వ్యూహాత్మక మౌనమా లేదంటే ఇప్పుడే తొందరపడి వ్యాఖ్యలు చేయడం ఎందుకనుకుంటున్నారా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది అర్థంకావడంలేదని, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్, మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అదేరోజు పార్టీ మేనిఫెస్టోని, అభ్యర్థులను ప్రకటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో డేటా వార్‌ సంచలనం సృష్టిస్తున్నా, తనపని తాను చేసుకుంటూ, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. మొత్తానికి డేటా వార్‌పై పవన్ కల్యాణ‌్ మౌనం, ఎవరికి వారు తమకు తోచినవిధంగా మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తోంది. మరి పవన్ నోరు విప్పితే, ఏ పార్టీని తప్పుపడతారు. రెండింటినీ ఒకే గాటన కడతారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Similar News