ఇక ఈశాన్య భారత సరిహద్దుల్లో చైనా చెలరేగిపోతోంది. భూటాన్, చైనాల మధ్య డోక్లాం పాసేజ్ ద్వారా భారత్ మీదుగా ఒక రోడ్డు నిర్మాణాన్ని తలపెట్టిన చైనా ఆ నెపంతో భారత సరిహద్దుల్లోకి చొరబడుతోంది. చైనా చొరబాట్లను పసిగట్టిన భారత్ 270 భారత బలగాలతో , రెండు బుల్డోజర్లతో భూటాన్ సరిహద్దుల దాకా కవాతు జరిపి చైనాను నిలువరించింది. ఈ ప్రయత్నం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంగా మారిపోయింది.భూటాన్ తరపున స్పందిస్తున్నట్లు భారత్ చెప్పుకున్నా.. సరిహద్దు తగాదాలో ఏ దేశం వాదన దానిదే.. ఈశాన్య రాష్ట్రాలకు దారిగా చెప్పుకునే చికెన్ నెక్ మార్గాన్ని చైనా దురాక్రమించి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రంతో సంబంధాలు లేకుండా తెంపేయాలని చూస్తోంది. ఇది చైనాతో ఒక తీరని తగవులా మారిపోయింది. డోక్లాం రోడ్డు నిర్మాణం పేరుతో చైనా రేపిన ఈ సరిహద్దు తగవు భారత్ కు ఆ సరిహద్దులో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.2018 మార్చి 26న చైనా విదేశాంగ ప్రతినిధి డోక్లాం చైనాదేనంటూ ప్రకటించారు. భారత్ దురాక్రమణకు ప్రయత్నించిందంటూ ఎదురు దాడి చేశారు. అప్పటి నుంచి నేటి వరకూ భారత, చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్య అలా కొనసాగుతూనే ఉంది..
ఒకవైపు పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రమూకల దాడులు, మరోవైపు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు మన రక్షణ దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పైగా శత్రువు శత్రువు మిత్రుడేనన్నట్లు పాకిస్థాన్, చైనా స్నేహ గీతం పాడుకుంటూ భారత్ ను దెబ్బ తీయడంలో ఒకరినొకరు సమర్ధించుకుంటున్నారు. ఇద్దరికీ శత్రువు మనదేశమే. పైకి మాత్రం చెరగని చిరునవ్వుతో స్నేహ హస్తం చాస్తుంటాయి. ఈ రెంటి సమస్య చాలదన్నట్లుగా కొన్ని స్వదేశీ ఉద్యమాలూ మనకి తలనొప్పులు తెచ్చాయి.. ఇంకా తెస్తున్నాయి.పంజాబ్ లో ఒకప్పుడు వినిపించిన ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ ఇప్పుడు రెక్కలు తొడుగుతోంది. తమక ప్రత్యేక దేశమే కావాలంటూ 1971లో ప్రారంభమైన ఖలిస్తాన్ ఉద్యమం పతాక స్థాయికి చేరి ప్రధాని ఇందిరను పొట్టన పెట్టుకుంది. ఖలిస్తాన్ ఉద్యమ నేత భింద్రన్ వాలే ను బ్లూ స్టార్ ఆపరేషన్ లో మట్టు పెట్టడంతో ఈ ఉద్యమం మరింత పెచ్చరిల్లింది. ఆ తర్వాత కనిష్క విమానం బాంబు పేలుడు 328 మందిని బలిగొంది. సిక్కు ఆందోళనాకారులు తీవ్రవాదులుగా మారి కొన్నాళ్లు పంజాబ్ ను అతలాకుతలం చేసినా మాజీ ప్రధాని పీవీ హయాంలో దీనిని పూర్తిగా నియంత్రించగలిగారు.
ఆ తర్వాత కొన్నాళ్ల పాటూ ఖలిస్తాన్ ఉద్యమం కనిపించకపోయినా.. ఈ మధ్యకాలంలో కొంత కాలంగా మళ్లీ వేర్పాటు వాదం బుసలు కొడుతోంది. సోషల్ మీడియాలో ఖలిస్తాన్ ఉద్యమ వీరుల్లా కొందరు పోస్టింగులు పెడుతున్నారు.అయితే ఈ సారి ఉద్యమం రూపు, షేపు మారిపోయాయి. గతంలో లా సిక్కు గెడ్డాలు, కత్తులు లేవు.. ఇప్పటి ఖలిస్తానీ ఉద్యమ కారులు చాలా నీట్ గా షేవ్ చేసుకుని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లా కనిపిస్తున్నారు.అయితే వీరికి బయట దేశాల నుంచి వెన్ను, దన్ను అందుతోంది. ఖలిస్తాన్ ఉద్యమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నేటి తరం నయా మిలిటెంట్ల కుటుంబాలు వేటికీ గతంలో ఈ ఉద్యమంతో సంబంధమే లేదు.. అలాగని1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కుటుంబాలకు చెందిన వారూ కాదు.. పంజాబ్ లో 1980-90 మధ్య కాలంలో చెలరేగిన హింసకూ వీరికి సంబంధం కూడా లేదు. ఈ కొత్త తరం ఖలిస్తాన్ వేర్పాటు వాదులను కెనడాలోని కొన్ని ఉగ్రవాద సంస్థలు శిక్షణ, నిధులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నాయని ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. వీరి వ్యూహాలు కూడా కొత్త తరహాలోనే.. వీరు సైబర్ స్పేస్ వాడుతూ ఉద్యమాలు నడుపుతున్నారు. లూధియానాలో ఆరెస్సెస్ సభ్యులను, డేరా సచ్చా సౌదా అనుచరులను, ఒక క్రిస్టియన్ పాస్టర్ ను చంపిన సంఘటనతోనే ఖలిస్తాన్ మలిదశ ఉద్యమం వెలుగులోకి వచ్చింది. ఇలా భారత్ పై ముప్పేట దాడి జరుగుతోంది.