బెంగాల్ లో లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు చెట్టా పట్టాలేసుకుంటున్నాయి. బలమైన మమతా దీదీని దెబ్బ తీసేందుకు ఆగర్భ శత్రువులిద్దరూ ఏకమవుతున్నారు. పార్టీ పవర్ లో లేకపోయినా క్షేత్ర స్థాయిలో ఇంకా బలంగా ఉన్న వామ పక్షాలు కమలనాథులకు జై కొడుతూ మమతా దీదీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు.
శత్రువు శత్రువుకు మిత్రుడంటారు. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి. దశాబ్దాలుగా అధికారం వెలగబెట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా మిగలలేని లెఫ్ట్ పార్టీలు దీదీని దెబ్బ తీసేందుకు అవసరమైతే రైటిస్ట్ పార్టీతో నైనా జంకులేకుండా కలుస్తామంటున్నాయి. పైకి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోయినా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు బీజేపీని సమర్ధిస్తున్నట్లు అయిదు దశల పోలింగ్ లో తేటతెల్లమైంది. లెఫ్ట్ పార్టీలు, బీజేపీ ఇద్దరి ఉమ్మడి లక్ష్యం మమతా బెనర్జీని ఓడగొట్టడమే.. అందుకే క్షేత్రస్థాయిలో వామపక్ష నేతలు కమలానికి జై కొట్టేస్తున్నారు.
బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో బీజేపీకి అస్సలు బలం, బలగం రెండూ లేవు తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇంకా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాంతో బెంగాల్ లో పాగా వేద్దామనుకున్న బీజేపీ క్షేత్రస్తాయిలో వామపక్ష కార్యకర్తలను చాలా తెలివిగా దారిలోకి తెచ్చుకున్నారు. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న వామపక్ష కార్యకర్తలు మమతా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు భరిస్తూనే సైలెంట్ గా కమలానికి జై కొడుతున్నారు.. అవసరమైతే కమలానికి బాహాటంగా మద్దతివ్వడానికి కూడా వారు వెనకాడటం లేదు.. 34 ఏళ్ళ వామపక్ష పాలన తర్వాతఅధికారంలోకి వచ్చిన తృణమూల్ బూత్, వార్డు లెవెల్లో వామపక్ష కార్యకర్తలను బెదిరిస్తోంది. దౌర్జన్యాలకు పాల్పడుతోంది..ప్రధాని మోడీ కూడా ఎన్నికల ర్యాలీలో తృణమూల్ కార్యకర్తలను గూండాలని సంభోధించారు. దీదీ పార్టీ ఆగడాలు భరించలేని లెఫ్ట్ పార్టీల స్థానిక నేతలు పోలింగ్ బూత్ లలో కమలానికి సహకరించడమే కాదు తమకు పట్టున్న ప్రాంతాల్లో కమలాన్ని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ పోల్ మేనేజర్లతో కలసి రహస్య సమావేశాలు జరపడం, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంలాంటివి చేస్తున్నారు.. బీజేపీకి ఏజెంట్లు లేని చోట వామపక్ష ఏజెంట్లే వారికి సహకరిస్తున్నారు. త్రిపురలో మాణిక్ సర్కార్ ను కుప్ప కూల్చడంలో కూడా ఇదే బీజేపీ, లెఫ్ట్ బంధం పనిచేసింది. ఇప్పుడూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ పరిస్థితిని ముందే గమనించిన మమత తమ శ్రేణులను ఎలర్ట్ చేశారు. వామపక్ష, బీజేపీ బంధం బలపడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.