ప్రధాని మోడీ నియంత అంటూ కొందరు విమర్శిస్తారు. కాదు కాదు బలమైన ప్రధాని అని మరికొందరు అంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాజగా మరో వాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ ఎన్నికల్లో మోడీ గెలిస్తే ఇక మరోసారి ఈ తరహా ఎన్నికలు జరగవని అంటోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంటరీ తరహా ప్రజస్వామ్యం విఫలమైందా? అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే మనకు శరణ్యమా? లాంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఎందుకు విఫలమవుతోంది? ఆశించిన లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నాం? అమెరికా తరహా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం పొందలేమా?
దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం రావాలని వాదిస్తున్న నాయకులెంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో నిఖార్సైన కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు. శశిథరూర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరో వైపున దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వచ్చే ప్రమాదం ఉందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పతనమయ్యే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్న వారూ ఉన్నారు. ఇందులోనూ కరడు గట్టిన కాంగ్రెస్ వాదులే ఉన్నారు. ఏమైతేనేం దేశంలో ఓ సరికొత్త అంశంపై చర్చ జరిగే అవకాశాన్ని కాంగ్రెస్ అందించింది. ఈ చర్చనే గనుక ప్రాచుర్యంలోకి వస్తే ఇక ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది రాబోయే ఎన్నికల్లో స్పష్టం కానుంది.
భారతదేశ రాజ్యాంగం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. అదే సందర్భంలో ఎన్నో సవరణలకూ గురైంది. అదే సమయంలో దాని మూల స్వరూపం మారిపోకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత వహించింది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నో దేశాలు రాజ్యాంగంలో భారీ మార్పులు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో సమూలంగా మార్చివేసుకున్నాయి. భారతదేశంలోనూ అలాంటి పరిస్థితే వస్తే అది ఏ రూపంలో జరుగుతుందనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. చర్చకు దారి తీస్తోంది.