నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై జాతీయస్ధాయిలో ఆసక్తి నెలకొంది. రెండు జాతీయ పార్టీలు వర్సెస్ ఓ ప్రాంతీయ పార్టీ మధ్య నడిచే సమరంలో, విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత ఎన్నికల్లో గెలిచి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గులాబీ నాయకురాలు అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా మళ్లీ బరిలో దిగుతుండగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ బరిలో నిలిచారు. కమలం పార్టీ నుంచి క్యాడర్ పెంచుకున్న నాయకుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తానికి దేశ స్ధాయిలో హీట్ పుట్టిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చరిత్ర ఏంటో చూద్దాం.
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, జగిత్యాల్, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 14 లక్షల 88 వేల 270 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 7 లక్షల 49 వేలు, పురుషులు 7 లక్షల 1 వేయి వరకు ఉన్నారు. ఇక 2014 ఎన్నికలను పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో త్రిముఖపోరు కొనసాగింది. టీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ బరిలో దిగారు.
కిందటి ఎన్నికల్లో మొత్తం 10 లక్షల 33 వేల 924 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4 లక్షల 39 వేల 307 ఓట్లు వచ్చాయి. అంటే దక్కిన పర్సంటేజ్ 42.49 శాతం. ఇక కాంగ్రెస్ క్యాండిటేట్ మధుయాష్కీకి 2 లక్షల 72 వేల 123 ఓట్లు అంటే 26.32 శాతం ఓట్ షేర్, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు 2 లక్షల 25 వేల 333 ఓట్లు, 21.79 శాతం ఓట్ షేర్ దక్కింది. ఆ ఎన్నికల్లో కవితకు వచ్చిన మెజారిటీ లక్షా 67 వేల 184ఓట్లు.
ఈసారి ఎన్నికల్లో ఆ పార్లమెంట్ స్ధానాన్ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఒక్క అవకాశమంటూ కమలదళం నేతలు స్ట్రాటజీలు సిద్దం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో ఉండటంతో ఎలాగైనా ఈసారి ఆ కోటపై తమ జెండాలను ఎగురవేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ఇక ముగ్గురు అభ్యర్థుల బలాబలాలు ఏంటో చూద్దాం. సిట్టింగ్ ఎంపీ కవితకి కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయంటారు విశ్లేషకులు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి- కరీంనగర్- నిజామాబాద్ రైల్వే లైను పూర్తి చేయటం, లక్కంపల్లి వద్ద సెజ్‌లో ఫుడ్ పార్క్ నిర్మాణం, పతంజలి సంస్థ విభాగం ఏర్పాటు, నిజామాబాద్- నిర్మల్ జిల్లాలను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మాణం, మెడికల్ కాలేజికి ఎంసిఐ అనుమతులిప్పించడం, నిజామాబాద్ నగరంలో పలు చోట్ల రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం లాంటి అంశాలు ఆమెకు ప్లస్ కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్‌లో పసుపు బోర్డు కోసం పోరాడిన తీరు, గల్ప్ బాదితులను స్వగ్రామాలకు రప్పించడంలో జాగృతి సేవలు, టీఆర్ఎస్ అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశంగా ఉన్నాయి. బలమైన క్యాడర్ ఉండటాం, ప్రతిపక్షంలో బలమైన నాయకుడు లేకపోవటం కవితకి పాజిటివ్ అంశాలుగా చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.
ఇక మధుయాష్కీకి అనుకూలించే అంశాలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2 సార్లు వరుసగా పోటీ చేసిన మధుయాష్కి ఎన్ఆర్ఐగా జిల్లా ప్రజలకు సుపరిచితుడు.
రెండు సార్లు ఎంపీగా చేసిన అభివృద్ధి పనులు.
తన హయంలో తీసుకొచ్చిన రైల్వే లైన్. పాస్ పోర్టు కార్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం.
బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవవర్గంలో బీసీ అభ్యర్థి కావటం. ఇక మైనస్‌ల విషయానికొస్తే
ఐదేళ్లుగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవటం.
పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోవటం, సీనియర్ నేతలు టీఆర్ఎస్‌లో చేరటం.
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విషయానికొస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉండటం.
బలమైన మున్నూరు సామాజికవర్గం నుంచి అభ్యర్థిగా నిలబడటం.
తండ్రి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆశీస్సులు ఉండటం,
రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుని.. యూత్‌లో మంచి క్రేజీ సంపాదించడం, మోదీ చరిష్మా కలిసొస్తుందన్న నమ్మకం. ఇక మైనస్ పాయింట్స్‌కి వస్తే....
బీజేపీలో జూనియర్ వర్సెస్ సీనియర్ గ్రూప్ విబేధాలు.
సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టడం. ఒకరుద్దరికే ప్రాధాన్యం ఇవ్వటం.
సోదరుడు ధర్మపురి సంజయ్పై ఉన్న లైంగిక ఆరోపణలు.