ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్‌లో పొలిటికల్ కాంట్రావర్సీ ఏంటి...నాదెండ్ల భాస్కర్ రావు అభ్యంతరాలేంటి... కథానాయకుడులో రాజకీయాంశాలు ఇంకేం ఉన్నాయి? కథానాయకుడు సినిమాలో పొలిటికల్ సన్నివేశాలు ఏంటంటే.....ఇందులో రెండు మూడు సీన్లలో అల్లుడిగా చంద్రబాబు కనిపిస్తారు. కాంగ్రెస్‌లో ఉండగా, వైఎస్‌నూ తన స్నేహితుడిగా ఎన్టీఆర్‌కు పరిచయం చేస్తారు చంద్రబాబు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే బాబు ఎమ్మెల్యేగా ఉంటారు. అప్పటికే ప్రజాసేవలోకి రాబోతున్నట్టు, అల్లూరి సీతారామ రాజు గెటప్‌లో ఉన్న టైంలో, తనను కలిసిన విలేకరులకు చెబుతాడు ఎన్టీఆర్. ఇది పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబును చాలామంది వాకబు చేస్తుంటారు. మీ మామ పాలిటిక్స్‌లో వస్తున్నారట కదా అని అడుగుతుంటారు. ఇదే సందర్భంలో భవనం వెంకట్రాం, సీఎంగా ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుంది. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఎన్టీఆర్‌ను ఒప్పించాలని, చంద్రబాబును అడుగుతారు భవనం వెంకట్రాం. ఇక్కడే నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర ఎంటరవుతుంది. ఆ ప్రమాణస్వీకారంలో, ఎన్టీఆర్, నాదెండ్ల పక్కపక్కనే కూర్చుంటారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారని, ప్రజల్లోంచి సీఎంలు వస్తారని, అయితే కాంగ్రెస్‌లో ఢిల్లీ సీల్డ్ కవర్లలోంచి వస్తారని, నాదెండ్ల, ఎన్టీఆర్‌తో అన్నట్టు చూపించారు. ఇదే సందర్భంగా రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. ఇవే సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నాదెండ్ల భాస్కర్ రావు.
అసలు కాంగ్రెస్ అధిష్టానంపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన పాత్రను తప్పుగా చూపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు నాదెండ్ల. అయితే నాదెండ్లకు సంబంధించిన అసలుసిసలు ఎపిసోడ్, మహానాయకుడిలో కనిపించబోతోంది. ఆ తర్వాత మొత్తం రాజకీయ సన్నివేశాలే. ఇందులో వైశ్రాయ్ ఎపిసోడ్ ఉంటుందా....ఉంటే బాబు తిరుగుబాటును ఎలా చూపిస్తారు...లక్ష్మీ పార్వతి పాత్రను ఎలా చిత్రీకరిస్తారన్నది అసలుసిసలు పొలిటికల్ ఎపిసోడ్స్. కథానాయకుడు సినిమాపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. మరోవైపు బాలయ్య, క్రిష్ తెరకెక్కించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాకు పోటీగానో, కౌంటర్‌గానో, రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. మహానాయకుడు విడుదలవుతున్న టైంలోనే వస్తోంది. ఇప్పటికే అనేక టీజర్లు, పాటలు రిలీజ్ చేసిన వర్మ, కథానాయకుడు సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు రిలీజ్ చేసిన ఒక పాట యూట్యూబ్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందరో ఉండగా, లక్ష్మీ పార్వతినే ఎందుకూ అంటూ ప్రశ్నించే ఆ పాట, సూటిగా కొందర్ని తాకుతోంది. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్‌లపై తెలుగు రాష్ట్రాల్లో యమ హాటుగా డిస్కషన్ జరుగుతోంది. ఎవరి పాత్రను ఎలా చిత్రీకరిస్తారో, చరిత్రాత్మక ఘట్టాల్లో ఎవరిని విలన్‌గా, ఎవరిని నిమిత్తమాత్రులుగా చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది.