ఎన్నికల భారతంలో మహా యుద్ధానికి తెర లేచింది. గెలుపు కోసం నేతలు ఈసీ గీసిన బరిని కూడా దాటేస్తున్నారు. మాటకు మాట చివరకు హద్దులు దాటేసి మరీ దూకుడు పెంచేస్తున్నారు. ప్రధాని మోడీ ఇందులో అందరికన్నా ముందున్నారు. గెలుపు కోసం నేతలు కట్టు తప్పేస్తున్నారు..కోడ్ ను కొండెక్కిస్తున్నారు. ఏం చేసైనా సరే అధికారం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇష్టాను సారం మాట్లాడే స్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకోసం దూకుడు పెంచింది. బెంగాల్ లోని సేరంపూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ ఒక్కసారిగా మాటల దాడి పెంచేశారు బెంగాల్ కాళిక దీదీని టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోయారు.. మే 23 తర్వాత టీఎంసీ దుకాణం ఖాళీ అవుతుందన్నారు.
బెంగాల్ లో కమలం వికసిస్తుందని, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోతారని అన్నారు. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. మమత ఓటమి ఖాయమని పార్టీ బోర్డు తిప్పేసుకుంటారనీ జోస్యం చెప్పారు. ఢిల్లీ పీఠం కోసం ఆమె కనే కలలు కల్లలేనన్నారు. మేనల్లుడికి పట్టం కట్టాలనుకుంటున్న ఆమె ప్రయత్నాలు నెరవేరవన్నారు. దీదీపై మోడీ ఇలా చెలరేగడం తొలిసారి కాదు.. అభివృద్ధికి అడ్డంకిగా మారిన మమత ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ అని గతంలో తిట్టిపోశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. దీనికి కౌంటర్ గా మమత కూడా స్పందించారు. బెంగాల్ ప్రజలకు రసగుల్లాలు పంచడమే కాదు రాళ్లు వేయడం కూడా తెలుసన్నారు. మమతా మాటలకు కౌంటర్ ఇస్తూ ప్రజల కోసం ఆ రాళ్ల దెబ్బలు భరించడానికి తాము సిద్ధమేనని మోడీ బదులిచ్చారు.తొలి మూడు దశల్లో బీజేపీకి పెద్దగా సీట్లు రావని విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలో బెంగాల్ లో ఆ లోటును భర్తీ చేసుకోడానికి మోడీ చెలరేగి మాట్లాడారు. ఈ మాటల యుద్ధం ఎవరికి ఫలితాన్నిస్తుందో చూడాలి.