2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే పదేళ్లు ఢోకా లేదని కమలనాథులు సంబురపడ్డారు. తిరుగులేని ఆధిపత్యంతో భారత్ వెలిగిపోతుందంటూ భావించారు. తనను 2024 వరకూ ఎవరూ కదపలేరని మోడీయే స్వయంగా చెప్పారు కూడా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2019లో బంపర్ మెజారిటీతో కమలం బ్యాండ్‌మోగిస్తుందా? ఎవరు ప్రధాని కాగలగుతారు?
ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం వల్ల, దేశంలో మోడీ పట్ల ఆదరణ ఇంకా తగ్గిపోనందువల్ల, ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు మోడీ ప్రభుత్వంపై రాకపోవడం వల్ల... తమకు ఎదురులేదంటోంది కమలం. మోడీ మళ్లీ బ్రహ్మాండమైన మెజారిటీతో వస్తారంటూ ధీమాగా ఉంది. అటల్ బిహారీ వాజపేయి తర్వాత బీజేపీలో అంతటి ఆకర్షణ గల నాయకుడు మోడీయేనంటూ ఆ పార్టీ నేతలే ఢంకా బజాయించుకుంటున్నారు. మరి ఈ ఎన్నికల ఏడాదిలో మోడీకి అనుకూలంగా పనిచేసే అంశాలేమిటి? ప్రతికూలంగా పనిచేసే అంశాలేమిటి? దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మోడీని ఎదుర్కొంటున్న సమస్య. మూడేళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో భారతదేశం ఆశాకిరణంలా కనపడింది. చైనాలో ఆర్థిక పురోగతి సన్నగిల్లగా మనదేశం వేగవంతంగా పుంజుకుంది. కాని క్రమంగా ఈ అభివృద్ది రేటు తగ్గిపోతూ వచ్చింది. భారతదేశం వెనుకపడిపోయింది. జీడీపి అభివృద్ది రేటు పడిపోవడమే కాదు ఎగుమతులు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ప్రగతి గత అయిదేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. ఇక మోడీ ప్రకటించిన అనేక పథకాలు ముఖ్యంగా మేక్‌ఇన్ ఇండియా, స్మార్ట్‌సిటీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. నేతల అవినీతిపైకి కనపడకపోయినప్పటికీ వ్యవస్థీకృత అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అవినీతి లేకుండా పనులు సాగని పరిస్థితి ఉంది.
ప్రతిపక్షం బలంగా లేకపోవడం ప్రధానంగా మోడీకి అనుకూలంగా ఉపయోగపడేదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికీ దేశంలో మధ్యతరగతి, యువత మోడీ ఈ దేశాన్ని అభివృద్ది పథంలోకి నడిపిస్తారని నమ్ముతున్నారు. మోడీపై చాలా మందికి నమ్మకం పోలేదు. ముఖ్యంగా ఈ దేశంలో ఒక హిందూ అనుకూల వాతావరణం మోడీ తీసుకురావడం మోడీకి కలసిరావచ్చు. కానీ బీజేపీ మెజారిటీ సీట్లు సాధించలేకుంటే ఎన్డీఏ మిత్రపక్షాల నేతలందరూ మోడీనే ప్రధానిగా అంగీకరిస్తారా.. లేదా బీజేపీలో మరో నేతను కోరుకుంటారా అన్నదే ఇప్పుడు పాయింట్.