125 రోజులు... 200 కార్యక్రమాలు.. కిందటేడాది డిసెంబరు నుంచి ఇప్పటి దాకా మోడీ పర్యటించిన వివరాలివి. విజయమే లక్ష్యంగా దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని మోడీ.. కార్యకర్తలకు కర్తవ్యబోధ చేస్తూ కదనోత్సాహాన్ని కలిగిస్తున్నారు. డిసెంబరు 25 నుంచి మే 1వ తేదీ దాకా మోడీ టూర్ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం.
ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది చివరి నుంచి ఇప్పటిదాకా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 200 సభలు, సమావేశాల్లో పాల్గొన్నారని పీఎం వెబ్‌సైట్ తెలిపింది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లిన ప్రధాని... విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల అధ్యక్షులు, రాజకీయ కార్యకర్తలతో ముచ్చటించారని వెబ్‌సైట్ రాసుకుంది. ఇప్పటికే ఐదు దశలు పూర్తవడం... ఇంకా రెండు దశలే మిగిలి ఉండటంతో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. మోడీ మార్చి 28 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ 45 రోజుల వ్యవధిలో ఆయన దేశవ్యాప్తంగా 150 ర్యాలీల్లో పాల్గొనేలా క్యాంపెయిన్ టీం ప్లాన్ చేసింది. మార్చి 28న మీరట్‌లో జరిగిన బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించనున్న ప్రధాని... అదే రోజు జమ్మూలోనూ ప్రచారం నిర్వహించారు. మార్చి 29, ఏప్రిల్ 1న ఒడిశా, మార్చి 30, ఏప్రిల్ 3న అసోం, బెంగాల్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. మార్చ్ 31న మోడీ ఈటానగర్ ఓటర్లతో మమేకమయ్యారు.
ఎన్నికల ప్రచారంలో దూకుడు మరింత పెంచే క్రమంలో భాగంగా 200 ప్రాంతాల్లో విజయ్ సంకల్ప్ పేరుతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ప్రచారంలో భాగంగా ప్రధాని... మై బీ చౌకీదార్ ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాకగ. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసిన క్యాంపెయిన్ టీం... ఇందులో భాగంగా ప్రతి 4 నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా విభజించింది. ఆ నియోజకవర్గాల పరిధిలో అందరికీ అనుకూలమైన చోట మోడీ బహిరంగ సభలకు ఏర్పాటు చేసింది. ఇలా చేయడం వల్ల మోడీ ప్రతి నియోజకవర్గ ప్రజలను పలకరించే అవకాశం లభించిందని బీజేపీ భావిస్తోంది. ఇక అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, బెంగాల్‌లో మోడీ టీం ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యూపీలో 80, బెంగాల్‌లో 42, బీహార్‌లో 40 నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన మోడీ యూపీలో 20, బీహార్, బెంగాల్‌లో 10 క్లస్టర్లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ, బీహార్‌లోని 120 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 104 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి నల్లేరుపై నడకలా సాగేలా కనిపించడం లేదన్నది కమలనాథుల అంచనా.