హడావుడిగా వర్మను తొలగించాల్సిన అవసరమేంటి?

Update: 2019-01-12 05:46 GMT

హైపవర్‌ కమిటీలో మొత్తం ముగ్గురు సభ్యులుంటారు. అందులో ప్రధానమంత్రి, ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తరపున వచ్చిన న్యాయమూర్తి. అలాగే ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. ముగ్గురు సభ్యుల కమిటీలో రెండోవంతు, అలోక్ వర్మను తొలగించాలని నిర్ణయించింది. అందుకు కారణాలుగా సీవీసీ ఆరోపణలని వాదించింది కూడా. అయితే ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కమిటీలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సీబీఐ డైరెక్టర్‌ను మనం ఎందుకు తొలగిస్తున్నాం...కనీసం వాదన వినిపించడానికి ఆయనకెందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఆయన వెర్షన్ వినిపించుకునే ఛాన్స్ ఇవ్వాలని ఖర్గే కోరారు.

ఖర్గే చేసిన వాదనలో తప్పేమీ లేదు. హంతకులు, పెద్దపెద్ద స్కామ్‌లుచేసిన వారిక్కూడా, వారి వాదన వినిపించేందుకు ఆఖరి అవకాశం ఇస్తారు. మరి ఈయనెందుకు ఇవ్వరన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అసలు వర్మ తనపై వస్తున్న ఆరోపణలపై ఏం చెబుతాడో, ఎలాంటివాదన వినిపిస్తాడో..తనపై సీవీసీ ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెబుతాడో విని ఉంటే బాగుండేది. ఆ తర్వాత చర్యలు తీసుకున్నా ఎవరికీ అభ్యంతరాలు ఉండేవి కావు. మరెందుకు ఇలా, హడావుడిగా అలోక్‌ వర్మను తొలగించారన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. రాఫెల్‌పై మోడీ భయపడుతున్నారన్న దానికి ఇదే నిదర్శనమని, రాహుల్‌ సహా వివివిధ పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు. 

Similar News