ఈ ఉదయం కీలక ప్రకటన చేస్తానంటూ ట్వీట్ చేసి అందర్నీ ఊరించిన ప్రధాని మోడీ సస్పెన్స్‌కు తెరదించారు. కొద్ది గంటల క్రితం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ అంతరిక్షంలో కీలక ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఆ మిషన్ పేరు ఆపరేషన్ శక్తి అని దానిని విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రకటన తర్వాత అసలు మిషన్ ఆపరేషన్ శక్తి అంటే ఏమిటనే ఆసక్తి పెరిగింది. ఈ రహస్య ఆపరేషన్ ఎప్పుడు జరగిందనే ఆరా మొదలైంది. ఇంతకీ మిషన్ ఆపరేషన్ శక్తి దేనికి సంబంధించినది..?
మనదేశంలోని ఏదైనా ప్రాంతాలపై విదేశాలు శాటిలైట్లతో నిఘా పెడితే వాటిని పేల్చేయడమే మిషన్ ఆపరేషన్ శక్తి లక్ష్యం. ఇందుకోసం ఏ శాట్ అంటే యాంటీ శాటిలైట్ క్షిపణిని ప్రయోగించారు. అత్యంత కష్టమైన అంతరిక్ష ప్రయోగం మార్చి 27 ఉదయం జరిగింది. మన దేశం ప్రయోగించిన యాంటీ శాటిలైట్ వెపన్ సుమారు 300 కిలోమీట్లర ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని మూడంటే మూడే నిమిషాల్లో పేల్చేసింది. భారతదేశం ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి.
యుద్ధాల్లో వాడే గైడెడ్ బాంబులు, క్షిపణులు అన్నీ శాటిలైట్ ఆధారంగానే లక్ష్యాలను ఛేదిస్తాయి. ఉదాహరణకు మనదేశంపై ఏదైనా దేశం క్షిపణిని ప్రయోగిస్తే భారత్ అప్రమత్తమై ఆ క్షిపణికి డైరెక్షన్ చేసే ఉపగ్రహాన్ని కూల్చివేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఈ దెబ్బకు దాడి చేసిన దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కయ్యానికి కాలు దువ్వే శత్రు దేశాలకు చెక్ పెట్టేలా మనదేశం ప్రత్యర్థి దేశాల శాటిలైట్లను కూల్చే సామర్థ్యాన్ని సంపాదించింది. యాంటీ శాటిలైట్ వెపన్‌ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు రూపొందించారు. భారత్ దగ్గర ఉన్న ఏ క్షిపణిని అయినా మార్పులు చేసి యాంటీ శాటిలైట్ వెపన్‌గా వాడేలా తయారు చేశారు.
యాంటీ శాటిలైట్ వెపన్‌ను భూ ఉపరితలంపై నుంచికానీ, యుద్ధవిమానాలపై నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 2 వేల కిలోమీటర్ల లోపు ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ వెపన్‌ను ప్రయోగించగల టెక్నాలజీ ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఉంది. తాజాగా మిషన్ ఆపరేషన్ శక్తిని విజయవంతం చేయడం ద్వారా మనదేశం కూడా అంతరిక్షంలోనూ ఆయుధాలను ప్రయోగించే శక్తిని సంసాదించినట్లైంది. మిషన్ ఆపరేషన్ శక్తి ఏ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రయోగం కాదని ప్రధాని మోడీ అన్నారు. కేవలం మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసిన ప్రయోగమని చెప్పారు.