సుల్తాన్ పూర్ నియోజక వర్గం తీరు తెన్ను ఏంటి?

Update: 2019-04-13 10:05 GMT

యూపీలోని సుల్తాన్ పూర్ నియోజక వర్గం తీరు తెన్ను ఏంటి? ఇక్కడ ఓటర్ల జీవన శైలి, సరళి ఎలా ఉంటుంది?మేనకకు ఈసారీ గెలుపు నల్లేరుపై నడకేనా? ఫిలిబిత్, సుల్తాన్ పూర్ మేనక, కుమారుడు వరుణ్ ఇద్దరికీ మంచి పట్టున్న నియోజక వర్గాలు.. మరి అక్కడి అసలు సీన్ ఏంటో చూద్దాం.

2019 సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీ గద్దె కోసం జరుగుతున్న పోరులో యూపీని గెలిచేందుకు అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. స్టార్ కాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తున్నాయి. దేశభక్తిని రగిలిస్తున్నాయి. 80 సీట్లున్న యూపీలో కనీసం 70 సీట్లు గెలవాలని బీజేపి తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ73 సీట్లు దక్కాయి. కానీ మోడీ ఇమేజ్ కు ఈ మధ్య కాలంలో జరిగిన డ్యామేజీ కారణంగా బీజేపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది.. ఇక యూపీలోని సుల్తాన్ పూర్ నియోజక వర్గం నుంచి ఇందిర చిన్న కోడలు మేనక బీజేపీ నుంచి పోటీకి దిగుతున్నారు.గత ఎన్నికల నాటికి ఈ నియోజక వర్గం ఆమె కుమారుడు వరుణ్ గాంధీ చేతిలో ఉండేది. స్థానిక బీఎస్పీ అభ్యర్ధి పవన్ పాండేపై 42 శాతం ఓట్ల ఆధిక్యతతో వరుణ్ ఈ సీటు గెలుచుకున్నారు. నియోజక వర్గం విషయానికొస్తే 2014 లెక్కల ప్రకారం సుల్తాన్ పూర్ లో 1,703,698 మంది ఓటర్లున్నారు. వీరిలో 9 లక్షల 10 వేల మంది మగవారు, 7 లక్షల93 వేలమంది మహిళలు ఉన్నారు.సుల్తాన్ పూర్ లో గత ఎన్నికల్లో 56 శాతం మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు.

సుల్తాన్ పూర్ లో 5 అసెంబ్లీ సిగ్మెంట్లున్నాయి.గోమతీ నదీ తీరాన ఉన్న ఈ నియోజక వర్గం వ్యవసాయప్రధానమైనది. గత ఎన్నికల్లో అన్ని పార్టీలనుంచి ఇక్కడ కనీసం ఆరుగురు అభ్యర్ధులు పోటీలో నిలిచారు. సుల్తన్ పూర్ బాగా వెనుకబడిన ప్రాంతం.. సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు, రక్షిత మంచి నీరు సైతం లేని ప్రాంతం.. ఇక్కడ ఆడ మగ లింగ నిష్పత్తిలో కూడా తేడాలే.. ఆడపిల్లల సంఖ్య ఇక్కడ చాలా చాలా తక్కువగా ఉంది.82 శాతం హిందువులున్న ప్రాంతం కావడంతో బీజేపీ ఈ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకుంది. మేనక, వరుణ్ యూపీలోని సుల్తాన్ పూర్, ఫిలిభిత్ నియోజక వర్గాలను మార్చుకుంటూ గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా మేనక సీటు వరుణ్ కు, వరుణ్ సీటును మేనకకు కేటాయించింది బీజేపీ అధిష్టానం.

మేనకా గాంధీ ఈ సీటును తాను ఇప్పటికే గెలిచేసినట్లు ప్రకటించి దూకుడు ప్రదర్శించారు. తన గెలుపు ఖాయమని ముస్లింలు తనతో కలిసొచ్చి.. సహకరించాలని, వారి ప్రమేయం లేకున్నా గెలుపు ఈజీయే అయినా.. వారు మర్యాదగా కలిసొస్తే బెటర్ అన్న సంకేతాలిచ్చారు. ఓట్ల ఏకీకరణ పేరుతో మేనక ఈ బెదిరింపులకు దిగారా? మేనక బెదిరింపులపై ఇప్పటికే విపక్షాలు ఈసీకి కంప్లయింట్ ఇచ్చాయి. మేనక ఇచ్చిన ఈ ఫినిషింగ్ టచ్ ఆమెకు వరమా? శాపమా తేలాలంటే ఎన్నికలయ్యే దాకా ఆగాల్సిందే. 

Similar News