మమత ర్యాలీకి డుమ్మాకొట్టే నేతలెవరు?

బీజేపీ వ్యతిరేక పక్షాల బలం చూపాలని ఆమె పోరాటం. తన పిలుపుకు ఎంతమంది కదిలివస్తారో దేశమంతా చూడాలని, ఆమె ఆరాటం. అన్నింటికీ మించి తన నాయకత్వ సత్తా నిరూపించుకోవాలని పట్టుదల. కానీ ఆ అధినాయకురాలి సభకు ఎవరు వస్తారో.. ఎవరు రారో బోధపడ్డంలేదు.

Update: 2019-01-17 16:17 GMT

బీజేపీ వ్యతిరేక పక్షాల బలం చూపాలని ఆమె పోరాటం. తన పిలుపుకు ఎంతమంది కదిలివస్తారో దేశమంతా చూడాలని, ఆమె ఆరాటం. అన్నింటికీ మించి తన నాయకత్వ సత్తా నిరూపించుకోవాలని పట్టుదల. కానీ ఆ అధినాయకురాలి సభకు ఎవరు వస్తారో.. ఎవరు రారో బోధపడ్డంలేదు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఏడాదికాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్‌ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశమంతా పర్యటిస్తున్నారు. విపక్ష నేతలను కలుస్తున్నారు. దీనికి పతాకస్థాయి అన్నట్టుగా ఈనెల 19న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు మమత. దీంతో ర్యాలీపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే మమత ర్యాలీకి ఎవరెవరు వస్తారు, ఎవరు డుమ్మా కొడతారో తేలడం లేదు. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అటెండ్‌ కావడం లేదు. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే వెళ్తున్నారు. మమత ర్యాలీకి రాహుల్ హాజరుకాకపోవడంపై అనేక వ్యాఖ్యానాలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్‌ ప్రధానమంత్రి అభ్యర్థి అని స్టాలిన్‌ ప్రకటించగానే, ఎన్నికలయ్యే దాకా ఇలాంటి చర్చ పెట్టొద్దని మమత కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మమత వ్యాఖ్యలతో రాహుల్ నొచ్చుకోవడం వల్లే, ఈ ర్యాలీకి రావడం లేదని తెలుస్తోంది.

అంతేకాదు, కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి నాయకులకు మమత నుంచి ఆహ్వానం రాలేదు. వారెవరూ సభకు వెళ్లడం లేదు. వారి ఒత్తిడితోనే, రాహుల్‌, సోనియాలు కూడా సభకు దూరంగా ఉంటున్నారన్న మరోవాదన వినిపిస్తోంది. తాజాగా వామపక్షాలు కూడా ఈ ర్యాలీకి హాజరు కారాదని డెసిషన్ తీసుకున్నాయి. ఎందుకంటే బెంగాల్లో మమతకు సీపీఎం ప్రధాన ప్రత్యర్థి. మమతతో కలిసి వెళ్తే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆలోచనతోనే కమ్యూనిస్టులు కూడా ర్యాలీకి వెళ్లడం లేదు.

మమత స్థాయిలో లోక్‌సభ స్థానాలు తెచ్చుకొనే అవకాశం ఉన్న మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లు కూడా కోల్‌కతా ర్యాలీకి వస్తామని కన్‌ఫాం చేయలేదు. ఎందుకంటే, ఆల్రెడీ యూపీలో ఎస్పీ, బీఎస్పీలు కూటమి ఏర్పాటు చేశాయి. ఇప్పుడు మమత ర్యాలీకి వెళ్తే, ఒకే కూటమి కింద జతకడతారని భావిస్తున్నారు మాయావతి, అఖిలేష్‌. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక మమత ర్యాలీకి వెళ్తున్న నేతలు కూడా చాలామందే ఉన్నారు. తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఆమ్‌ఆద్మీ‌ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సభకు వెళ్తున్న నేతల్లో ఉన్నారు.

అయితే మొదటి నుంచి ఫెడరల్‌ ఫ్రంట్‌పై అందర్నీ కలుస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు మమతా బెనర్జీ ర్యాలీకి హాజరుకావడం లేదన్న విషయం, చర్చనీయాంశమవుతోంది. కోల్‌కతా వెళ్లి మరీ మమతన కలిసిన కేసీఆర్‌, ఆమె నిర్వహిస్తున్న సభకు ఎందుకు అటెండ్‌ కావడంలేదన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ ర్యాలీకి హాజరుకానుండటం, అలాగే చంద్రబాబు కూడా అటెండ్‌ అవుతుండటం, కేసీఆర్‌ వెళ్లకపోవడానికి కారణాలని తెలుస్తోంది. మొత్తానికి ఎవరికివారు ఫ్రంట్‌లు కడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ర్యాలీ ఎలాంటి సంకేతాలిస్తుందో చూడాలి. 

Similar News