40 డిగ్రీల ఉష్టోగ్రతతో మండుతున్న ఎండలు. అంతకు మించిన వేడి పుట్టించిన ఏపీలో శాశనసభ ఎన్నికలు ఓటర్లను సమీకరించడంలో ఫెయిల్ అయిన నేతలు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ తగ్గడానికి కారణం ఏంటి..? ఓటేసేందుకు ప్రజలు ఎందుకు బద్దకించారు.? తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలతో చూసినా నాలుగు నెలల క్రితం జరిగిన శానసనభ ఎన్నికలతో చూసినా 10 నుంచి12 శాతం తగ్గిపోయింది. ఎండ వేడిమికి ఈవీఎంల మొరాయింపు తోడవడంతో కొన్ని చోట్ల ఓటర్లకు చుక్కలు కనిపించాయి.
గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్ నమోదవగా.. తాజా ఎన్నికల్లో 12.63 శాతం తగ్గింది. హైదరాబాద్ నగరంలోనూ పోలింగ్ గణనీయంగా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో సగటున 48.89 శాతం పోలింగ్ నమోదు కాగా తాజాగా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కేవలం 39.49 శాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భువనగిరిలో 75.11శాతం, నల్లగొండలో 73.27శాతం నమోదైంది. అత్యల్పంగా సికింద్రాబాద్‌లో 39.20శాతం పోలింగ్ నమోదయింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మందకొడిగా సాగింది. ప్రతి 2 గంటలకు కేవలం 10 మాత్రమే పెరుగుతూ వచ్చింది. మొదటి గంటలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు రాలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు 10.6 శాతం పోలింగ్ నమోదుకాగా 11 గంటలకు 22.84 శాతానికి మాత్రమే చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 38.80, సాయంత్రం 3 గంటలకు 48.95, సాయంత్రం 5 గంటల వరకు 60.57 పోలింగ్ నమోదయింది. మొత్తానికి ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ ఎంతగా అవగాహన కల్పించినా హైదరాబాద్ నగర ఓటర్లలో బద్ధకం మాత్రం వీడటంలేదు. ప్రతి 100 మందిలో 61మంది ఇళ్లనుంచి బయటికే రావడంలేదు. దీంతో పోలింగ్ శాతం భారీగా తగ్గిందని భావిస్తున్నారు.