ఒకవైపు హైటెక్‌సిటీ మరోవైపు గ్రామీణ ప్రాంతాలు. కుబేరులైన అభ్యర్థులు విభిన్న ప్రాంతాల జనం. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. కుబేరులు తలపడుతున్న బరిలో గెలుపెరివదన్నదే అందరి అనుమానం. ఒకరు కారు దిగి చేయి పుచ్చుకున్న వారు ఇంకొకరు జోరు మీదున్న కారెక్కిన వారు వేరొకరు కదన కుతూహలంతో ఉన్న కమలదళ సభ్యుడు. కోటీశ్వరులైన అభ్యర్థులను బరిలోకి దింపిన ప్రధాన పార్టీలు చేవెళ్లలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మరి చేవెళ్ల పోరులో సై అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా ఏంటి? ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పోరులో నెగ్గేదెవరు.. గెలిచేదెవరు? నగర, గ్రామీణ ప్రాంత సమాహారంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు చేవెళ్ల నియోజకవర్గ వీక్షణం ఏం చెబుతుంది?
2009లో పార్లమెంట్ స్థానంగా ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌కు పట్టుకొమ్మ. కాంగ్రెస్ దిగ్గజ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఏవైనా హస్తం పట్టు సాధించాల్సిందే. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 24 లక్షల 15 వేల 598. ఇందులో పురుషులు 11 లక్షల 53 వేల 49, మహిళలు 10 లక్షల 32 వేల 130 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 13లక్షల 15 వేల 862 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కార్తీక్‌రెడ్డి, టీడీపీ నుంచి వీరేందర్‌గౌడ్ పోటీ చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగిన పోరులో చివరకు చేవెళ్లలో గులాబీ జెండా రెపరెపలాడించింది.
ఇక కిందటిసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 4 లక్షల 35 వేల 77 ఓట్లు పోలవగా.. 33.06 పోలింగ్ శాతం నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డికి 3 లక్షల 62 వేల 54 ఓట్లు, 27.51 ఓటింగ్ శాతం వచ్చింది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన వీరేందర్‌గౌడ్ మూడో స్థానానికి పరిమితం కాగా పోలైన ఓట్లు 3 లక్షల 53 వేల 203, పోలింగ్ శాతం 26.84.
ఈసారి ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యాపారవేత్త రంజిత్‌రెడ్డిని టీఆర్ఎస్ బరిలో నిలిపింది. బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇక మగ్గురు అభ్యర్థుల బలాబలాలను చూద్దాం. ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గురించి తెలుసుకుందాం లోక్‌సభ పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండటం, పార్టీలోకి జోరుగా వలసలు, బలమైన పార్టీ యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండటం ప్లస్ అయితే అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడం, క్షేత్రస్థాయిలో నాయకులతో పరిచయాలు లేకపోవడం, పార్టీ ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం మైనస్.
కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బలాబలాలను చూస్తే.. అభ్యర్థి కుటుంబ నేపథ్యం, ఆర్థిక వనరులు కలసిరావచ్చు. కార్పొరేట్ తరహాలో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే సత్తా ఉంది. ఎంపీగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఓటేస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఇక ప్రతికూలతల విషయానికొస్తే కాంగ్రెస్‌కు శాసనసభ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేక ఫలితాలు, నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే ఒక్కరే ఉండటం, టీఆర్ఎస్‌ను ఢీకొట్టగల స్థాయిలో పార్టీ యంత్రాంగం లేకపోవడం మైనస్.
ఇక బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి బలాబలాలను పరిశీలిస్తే కేంద్ర పథకాలు, ప్రధాని మోదీ ప్రభావం, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్యనాయకులు ఈ స్థానంపై దృష్టి కేంద్రీకరించడంవంటివి కలసిరావచ్చు. శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం మరీ బలహీనంగా ఉండటం బీజేపీకి మైనస్‌లుగా కనిపిస్తున్నాయి.