తమిళనాడులో ఎన్నికల హీట్ పెరుగుతోంది. జయ మరణంతో అనూహ్యంగా మారిపోయింది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం అన్నా డీఎంకే బీజేపీతోనూ, డీఎంకే కాంగ్రెస్ తోనూ జత కలిసి ఈసారి ఎన్నికలకు దిగుతున్నారు. ఇక తమిళ నటుడు కమల్ హాసన్, శశికళ వారసుడు దినకరన్ కొత్త పార్టీలతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాట రసవత్తరంగా మారిన పోల్ సీన్ పై ఓ లుక్కేద్దాం.
తమిళనాడులో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత మరణం తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.మొత్తం 39 ఎంపీ సీట్లున్న తమిళనాడులో 2014లో అన్నా డీఎంకే 37 స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ లేకుండా పోగా, పీఎంకే ఒకటి, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.
అయితే ఇది గతం ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయ అకాల మరణం, డీఎంకే అధినేత కరుణానిధి అస్తమయం తమిళ నాట ఎన్నికల సీన్ మొత్తాన్ని మార్చే సింది. తమిళనాడులో ఎలాగోలా పట్టు సంపాదించాలనుకున్న బీజేపి అన్నా డీఎంకే రాజకీయాల్లో తలదూర్చి కొంత వరకూ పట్టు కోసం ప్రయత్నించింది. అన్నా డీఎంకే రెండుగా చీలిపోవడం శశికళ జైలు పాలు కావడంతో పళని, పన్నీర్ వర్గాలు కలసిపోయాయి. దాంతో శశికళ మేనల్లుడు దినకరన్ మరో కొత్త పార్టీ పెట్టారు.మరోవైపు ఎన్నికల పొత్తుకోసం అటు డీ ఎంకేతో, ఇటు అన్నా డీఎంకేతో బీజేపి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే థర్డ్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో ఒక కొత్త కూటమికి అడుగులు పడుతున్న నేపధ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ రాహుల్, చంద్రబాబుల మిత్ర పక్షంగా మారిపోయారు.
తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల సరసన చేరాల్సిందే. అన్నా డీఎంకే, డీఎంకే ఈసారి చెరి 8 సీట్లను వారి మిత్ర పక్షాలకు వదిలి పెట్టాయి. ఈ రెండు పార్టీలు చెరి 20 సీట్లకు పోటీ పడుతున్నాయి.అన్నాడీఎంకే కూటమి 5 సీట్లు బీజేపికి కేటయించింది. కన్యాకుమారి, శివగంగై, కోయంబత్తూర్, తూత్తుకుడి, రామనాథపురం సీట్లను కమలానికి ఇచ్చే సింది. మిగిలిన స్థానాల్లో పీఎంకే, డీఎండీకే పోటీలో నిలుస్తున్నాయి.పీఎంకే ఏడు స్థానాల్లోనూ, డీఎం డీకే నాలుగు స్థానాల్లోనూ, ఆలిండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ ఒక స్థానంలోనూ పోటీ పడుతున్నాయి.
ఇక డీఎంకే సొంతంగా 20 సీట్లకు పోటీ చేస్తుండగా ఇందులో 13 మంది కొత్తవారు సెంట్రల్ చెన్నయ్ నుంచి మారన్, నీలగిరీస్ నుంచి రాజా, ట్యుటికోరన్ నుంచి కనిమొళి బరిలోకి దిగుతున్నారు.మరో 19 స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించింది. ఇక దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ 23 సీట్లలో బరిలోకి దిగుతోంది.
కొత్త పార్టీతో ముందుకొచ్చిన తమిళ నటుడు కమల్ హాసన్ అన్ని లోక్ సభ స్థానాలకూ తమ పార్టీ పోటీచేస్తుందన్నారు ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు లేకుండా సొంతంగా బరిలోకి దిగుతోంది మక్కల్ నీదీ మయ్యం పార్టీ అయితే పార్టీలో సీనియర్ నేత సీ.కె. కుమార వేల్ పార్టీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. తమిళనాడు ఏప్రిల్ 18న పోలింగ్ జరుగుతుండగా మే 23న ఫలతాలు వస్తాయి.