రాజకీయాలు వేరు, క్రీడలు వేరు. ఈ రెండూ వేర్వేరు రంగాలే అయినా వీటిమధ్య అవినాభావ సంబంధమే ఉంది. ఇటు రాజకీయవేత్తలు, అటు స్పోర్ట్స్ స్టార్లు అభిమానమే ఆలంబనగా రాణిస్తూ రావడం సాధారణ విషయమే. అయితే క్రికెటర్ల నుంచి బాక్సర్ల వరకూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని రాజకీయరంగంలో గడపడానికి ఎనలేని ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇటు అధికార బీజెపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ క్రీడాదిగ్గజాలను బరిలోకి దించడం ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొంటున్నాయి.
క్రికెట్ క్రేజీ భారత ఉపఖండ దేశాల రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. క్రికెటర్లు, బాక్సర్లు, అథ్లెట్లు, షూటర్లు...తమ రిటైర్మెంట్ జీవితాన్ని రాజకీయవేత్తలుగా గడపడానికే ఆసక్తి చూపుతున్నారు. తమ రెండో ఇన్నింగ్స్ ను రాజకీయరంగానికి అంకితమివ్వడం ద్వారా ప్రజాసేవ చేయటానికి తహతహలాడుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సైతం అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు. జనరంజక క్రీడాకారులుగా పేరుపొందిన విజేందర్ సింగ్, గౌతం గంభీర్, కృష్ణ పూనియా, గత తరం క్రికెటర్లు కీర్తి అజాద్, ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లను ఎన్నికల బరిలో నిలిపాయి.
భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలను తన రెండో ఇన్నింగ్స్ గా మలచుకొన్నాడు. బీజెపీ తీర్థం పుచ్చుకొని మరీ తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగాడు. మరోవైపు అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్ విభాగాలలో భారత ఆల్ టైమ్ గ్రేట్ స్టార్.. విజేందర్ సింగ్ 33 ఏళ్ల వయసులోనే...బాక్సింగ్ రింగ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు. దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి విజేందర్ సింగ్ ముక్కోణపు సమరంలో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
రాజస్థాన్ లోని వేర్వేరు లోక్ సభ స్థానాల నుంచి సిటింగ్ ఎంపీగా కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మాజీ ఒలింపియన్ కృష్ణ పూనియా బరిలో నిలిచారు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా కొద్ది రోజుల క్రితమే బీజెపీ పార్టీలో అధికారికంగా చేరింది. అయితే రాజ్ కోట లోక్ సభ సీటు కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. అంతేకాదు జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని...తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
క్రీడాకారులు ప్రధానంగా క్రికెటర్లు రాజకీయబరిలోకి దిగడం ఇదే మొదటిసారికాదు. గతంలోనే భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ జూనియర్, మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్, మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్, కీర్తి అజాద్, మాజీ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల రణరంగంలో పాల్గొన్నవారే. అంతర్జాతీయస్థాయిలో క్రికెటర్లుగా విజయవంతమైన వారు మాత్రమే కాదు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, సోదరి, తండ్రి సైతం రాజకీయ అరంగేట్రానికి తహతహలాడుతున్నారు.
జనరంజక క్రీడాకారులుగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న క్రీడాదిగ్గజాలు ప్రజాసేవకు రాజకీయాలను మించిన దారి మరొకటిలేదని భావించడమే ప్రధానకారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద విశ్వవిఖ్యాత క్రీడాకారులు సైతం రాజకీయాల వైపు చూడటం రాజకీయాలను తమ కెరియర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకోడం ఆహ్వానించదగ్గ పరిణామమే.