దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జీవితం నేపథ్యంలో వస్తున్న యాత్ర కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ఎవరు విలన్ అవుతారో, ఎలాంటి పొలిటికల్ క్యారెక్టర్లు దర్శనమిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. గతంలో మహాత్మా గాంధీ బయోపిక్ కూడా అనేక వివాదాలు రేపింది. ఇండియాలో విడుదల చేయరాదంటూ నిరసనలు జరిగాయి. ఇందూ సర్కార్ సినిమా కూడా అనేక వివాదాలు రాజేసింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిర, సంజయ్‌లు వ్యవహరించిన తీరు, ఇతివృత్తంగా సినిమా వచ్చింది. తమిళ ప్రజల ఆరాధ్య నటుడు, రాజకీయ దురంధరుడు ఎంజీ రామచంద్రన్ జీవిత కథ ఆధారంగా సినిమా. దీనిపై కావాల్సినంత కాంట్రావర్సీ. ఇక త్వరలో జయలలిత జీవితం కూడా తెరకెక్కబోతోంది. నిత్యామీనన్, జయలలితగా నటిస్తోంది.
నరేంద్ర మోడీ జీవితం కూడా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఛాయ్‌వాలా నుంచి ప్రధానమంత్రి దాకా నరేంద్ర మోడీ జీవిత ప్రయాణం చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మోడీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషిస్తారని టాక్ వినిపిస్తోంది. సినిమా అనేది బలమైన మాధ్యమం. అనేక బయోపిక్‌లు వస్తుంటాయి. కానీ ప్రజాబాహుళ్యంలో ఎంతో పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖుల జీవితకథ చిత్రాలు మాత్రం, అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పుస్తకాల రూపంలో చదివినా, సినిమాగా వస్తే, వారి జీవితం కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తుంది. గొప్ప నాయకుల జీవిత చిత్రాలు కాబట్టి, సినిమా నిర్మించేవాళ్లకు విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిిటీ వస్తుంది. కాంట్రావర్సితో కలెక్షన్లు కూడా పెరుగుతాయి. కానీ సినిమా ఇతివృత్తంలో కీలక పాత్రధారులు, కీలక ఘటనలను, ఎలా చూపెడుతున్నారన్నదే అసలు విషయం. రాజకీయ కారణాలు, ప్రయోజనాలతో గొప్ప నాయకుని జీవితంలో కీలకమైన, వివాదమైన అంశాలను తప్పులుగా చిత్రీకరించి, జనంలో చెడుగా ముద్ర వేసేందుకూ ఆయుధంగా ప్రయోగిస్తారు కొందరు. అలాగే తమకు నచ్చిన నేతను, మరింత గొప్ప నాయకుడిగా చూపెడతారు. ఇందులో ఎవరికి కావాల్సిన రాజకీయ ప్రయోజనాలు వారికుంటాయి.
అయితే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, క్రిష్ దర్శకత్వంలో, అలాగే వర్మ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌లు, వైఎస్సార్ యాత్ర సరిగ్గా ఎన్నికల సమయంలో వస్తున్నాయి. అదే కాంట్రావర్సీకి కేంద్ర బిందువవుతోంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని, పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సినిమాలతో జనాలు ప్రభావితం అవుతారా అన్నది చెప్పలేం. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ తమ అనుభవంలోంచి కూడా, ఫలానా క్యారెక్టర్లను అంచనా వేస్తారు. తప్పయితే, తప్పంటారు. సరైందయితే ఓకే అంటారు. కానీ ఎవరి జీవితాలూ తెలియని, కొత్తతరం మాత్రం ఇదే నిజమని నమ్మే ఛాన్సుంది. ఇదే ప్రమాదకరం. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికుంటాయి కాబట్టి, కథను తమకు అనుగుణంగా మలచుకుంటారు. ఉన్నది ఉన్నట్టు చూపించే తెగువ, అందరికీ, అన్ని సందర్బాల్లో ఉండదు. ఎవరి బయోపిక్‌లైనా,కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినా, మరిన్ని ప్రశ్నలతో ఎండ్‌కార్డ్స్ పడతాయి. చూడాలి, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే బయోపిక్‌లు ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో...