గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం దూసుకుపోతున్న గులాబీ సైన్యాన్ని సమాయత్తం చేస్తోంది. గ్రేటర్ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా తీసుకోవడంతో గెలుపు ఆ పార్టీకి కచ్చితంగా ప్రతిష్టాత్మకమే. అందుకే కేటీఆర్ రోడ్‌షోలు, ప్రచారాలతో గ్రేటర్ ప్రజలకు దగ్గరవుతున్నారు. మరి నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ఎఫెక్ట్ ఎంత? కార్పొరేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించిన రథసారథి ఇప్పుడు దాన్ని ఏమేరకు పెంచబోతున్నారు?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధానంగా మూడింటిపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే కసితో ప్రచారం నిర్వహిస్తుంది టీఆర్ఎస్.
ఒకప్పుడు గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీకి బలం లేదనే వాదన ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రచారం బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ కనీవినీ ఎరుగని మెజారిటీని సాధించారు. బల్దియా పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసారు. 150 స్థానాల్లో 99 స్థానాల్లో టీఆర్ఎస్ కార్పోరేటర్లు గెలుపొంది సత్తా చాటారు. అప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో ఎన్నికల ప్రచార బాధ్యతలు కేటీఆర్ భుజానికెత్తుకున్నారు.
కేటీఆర్ గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖమంత్రిగా పనిచేయడం కూడా ఆయనకు కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో గెలుపు కోసం గట్టిగా కృషి చేసిన కేటీఆర్ దాదాపు అన్ని సీట్లు పార్టీకి విజయం సాధించి పెట్టారు. దీంతో గ్రేటర్ పరిదిలో రాజకీయంగా కూడా గట్టి పట్టు సాధించారాయన. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధినేత కేసీఆర్ కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆరే స్వయంగా చూసుకుంటున్నారు. వలసలు ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తున్నారు.
పార్టీని సమన్వయం చేసుకుంటూనే అధినేత కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే అన్ని లోక్‌సభ స్థానాల్లో కేటీఆర్ సన్నాహాక సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నకలకు సమాయత్తం చేశారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారాయన. అన్నీ తానే అయి స్టార్ క్యాపెంయినర్‌గా దూసుకుపోతున్నారు. సారు కారు 16 స్థానాలు అనే ట్యాగ్ లైన్‌తో జనాల్లోకి వెళ్తున్నారాయన. మొత్తానికి కేటీఆర్ తానే అన్ని అయి ప్రచారం చేస్తుండటాన్ని పార్టీ పాజిటివ్ తీసుకుంటుంది. ఓ వైపు కేసీఆర్ భారీ బహిరంగ సభలో ద్వారా ప్రచారం చేస్తుంటే కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్‌షోలు టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది.