యూపీలో జరుగుతున్న కుంభమేళాను తలిపిస్తోంది.. ఏపీలో కోడి పందాల నిర్వహణ. ప్రయాగలో కుంభమేళాకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్టే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని పెదగరువులో పందెం రాయుళ్లు ఏర్పాట్లు చేశారు. ఎకరాలకు ఎకరాలనే కోడిపందాల బరులుగా మార్చేశారు. భారీగా టెంట్లు, వాహనాల పార్కింగ్ లాంటి సదుపాయాలు కల్పించారు. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలదే హైలెట్. ఆ కోడిపందాలకు కేరాఫ్ అడ్రస్.. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు. సంప్రదాయం పేరుతో జూదక్రీడలను అక్కడ నేతలు దగ్గరుండి మరీ జరిపిస్తుంటారు. కోర్టులు, పోలీసు ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా కోడిపందాలు నిర్వహిస్తుంటారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఆ పందాల కోసం పందెం రాయుళ్లతోపాటు జనం భారీగా వస్తుంటారు. ఇదిగో ఇలా కుంభమేళా మాదిరిగా కోడిపందాలకు జనం తరలిరావడంతో భీమవరం ప్రాంతం.. మరో ప్రయాగగా మారిపోయింది.
పశ్చిమగోదావరి జిల్లా పెదగరువులో కోెడిపందాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 200 బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తుండగా.. 80కోట్ల రూపాయల పైనే బెట్టింగ్‌లు దాటిపోయాయి. కోడిపందాలతో పాటు అక్కడే గుండాట, పేకాట లాంటి జూదక్రీడలు జోరుగా నిర్వహిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఈ పందాలను అడ్డుకోవడంలో పోలీసులు చేతులెత్తేయడంతో ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగిపోయారు. తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రయాగ కుంభమేళాను తలపిస్తోంది భీమవరం ఏరియా.