కేసీఆర్ కలల పథకాలను.. కేంద్రం ఫాలో అవుతుందా... కేసీఆర్ అనుకొని అమలు చేసిన పథకాలు సేమ్ టు సేమ్ మోడీ మదిలోనూ మెదిలాయా.. తెలంగాణ రాష్ట్రం... దేశానికి ఆదర్శంగా ఉందని పలుమార్లు పదేపదే చెప్పే కేసీఆర్ కలల పథకం రైతుబంధును మోడీ అమలు చేశారా... కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు అండగా ఉండేందుకు పంటసాయం అందిస్తామన్న కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ ప్రకటన తర్వాత ఇప్పుడిదే చర్చ నడుస్తోంది.
సంక్షోభ సేద్యాన్ని, లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం... రైతుబంధు. రైతుల పెట్టుబడి కష్టాలను తీరుస్తుందన్నది నమ్మకం. అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ అమలు చేసిన రైతుబంధునే... కేంద్రం పేరు మార్చిన పంటసాయం ఇప్పుడు పట్టాలెక్కింది. ఇది తమ పథకం కాపీయేనని నిజామాబాద్ ఎంపీ కవిత కూడా బడ్జెట్ ప్రసంగం తర్వాత వ్యాఖ్యానించడం విశేషం.
ఎన్నికల్లో ఓట్ల వరాలుగా చెప్పుకునే దేశంలో రైతుబంధు పథకం కచ్చితంగా అమలు అవుతుందని, దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. మొన్నటి ఎలక్షన్లలో విజయం తర్వాత ప్రధాని మోడీని కలసిన కేసీఆర్... ఈ పథకంపై బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఆయనతో చర్చించారని గులాబీశ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ పంట సాయం అమల్లోకి వచ్చిందని తెలంగాణ భవన్ చెప్పుకుంటుంది. మమతబెనర్జీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలన్న సంకల్పంతో ఉందని ప్రచారం కూడా జరిగింది. చంద్రబాబు కూడా పేరు మార్చి అన్నదాతలను ఆదుకునే పథకానికి ఇప్పుడు అమలు చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ పథకం దేశమంతా అమలు చేయక తప్పదని గతంలో కూడా సీఎం కేసీఆర్ అన్న విషయాన్ని గులాబీదళం గుర్తు చేసుకుంటుంది.
సాలీనా ఎకరానికి 10 వేల అందించే రైతుబంధు పథకం తెలంగాణలో అమలవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. ఖరీఫ్‌కు ఎకరానికి 5 వేలు, రబీకీ మరో 5 వేల చొప్పున ఏడాదికి 10,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. ఇదే పథకాన్ని కేంద్రం కూడా అమలు చేసి పేరు మార్చింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరి అన్నదాతలను ఆదుకునేందుకు సిద్ధమైంది.
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతరం బడ్జెట్‌లో కేంద్రం అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు వెల్లడించారాయన. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై 75వేల కోట్ల రూపాయల అదనపు పడుతుందన్న గోయల్ ఈ పథకం 2018 డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.