తెలుగుదేశం పార్టీ మొదటిసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినపుడు శాసనమండలిని రద్దు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఅర్ అసెంబ్లీలో తీసుకుంటున్న నిర్ణయాలకు మండలి పెద్దలు పడే పడే అడ్డు వస్తుండడంతో ఆయన మండలి రద్దు నిర్ణయం తీసుకుని అమలు చేసేసారు కూడా. ఇక అప్పట్నుంచి ఆంధ్రప్రదేశ్ కు శాసనమండలి లేకుండా చాలా రోజులు నడిచింది. అయితే, 2004 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. కాంగ్రెస్ నేతలకు పదవులు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాజశేఖర్ రెడ్డి పెద్దల సభను పునరుద్ధరించారు. ఇపుడు మళ్ళీ పదిహేనేళ్ల తరువాత పెద్దల సభ వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అపుడు ఎన్టీఅర్ కు ఎదురైనా పరిస్థితులే ఇపుడు జగన్ కూ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనీ, చిన్న తేడా ఏమిటంటే ఎన్టీఅర్ కి మండలి రద్దు చేయడానికి ఒకటే కారణం ఉంది. కానీ.. జగన్ కు రెండు కారణాలున్నాయి. ముందే చెప్పుకున్నట్టు పెద్దల సభలో చీటికీ మాటికీ ముఖ్యమంత్రిగా తానూ, తన ప్రభుత్వం చేపట్టే చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేయడం.. విమర్శల పాలు చేస్తూ ప్రజల్లో తమపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. ఎందునంటే శాసనసభలో పూర్తి స్థాయిలో తమ పార్టీకి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వున్నారు. మండలిలో అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో వారి పార్టీకి చెందిన ఎమెల్సీలు 58 ఉన్నారు. వైసీపీకి 8 మంది సభ్యులే ఉన్నారు. ఇది భవిష్యత్తులో జగన్ కు చికాకుగా పరిణమించే అవకాశం ఉంది.
ఇక రెండోది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య 23కు పడిపోయింది. ఇందులోనూ చంద్రబాబు, బాలయ్య మినహా మిగతా వారంతా టీడీపీలో తుది వరకు కొనసాగుతారా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. కానీ అదే సమయంలో మండలిలో మాత్రం మాజీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరంతా భవిష్యత్తులో అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమే. దీంతో వీరిని మండలిలోనూ లేకుండా చేస్తే వారి రాజకీయ భవిష్యత్తును పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చు.
నిజానికి మొదటి కారణం ఎంత ప్రముఖమైనదో రెందోదీ అంతే ప్రాదాన్యమైనది. అందుకే, మోదీతో భేటీలోనే ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ చర్చించారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దానికి మోడీ కూడా అభ్యంతరం చెప్పలేదనేది వారి మాట. ఏది ఏమైనా విప్లవాత్మక పాలనా సంస్కరణలకు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముందు ముందు మరింత దూకుడుగా ఆ దిశలో అడుగులు వేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం.