రోజాకు మంత్రి పదవి ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదంటూ రాష్ట్రమంతా ఒకటే చర్చ. సోషల్ మీడియాలోనైతే అదే రచ్చ. ఆఖరికి తెలంగాణ నుంచి రాములమ్మ కూడా రోజాకు న్యాయం జరగాలని ఎలుగెత్తారు. వీరందరి మొరలు విన్నారో, రోజా అలక తీర్చాలని డిసైడయ్యారో కానీ, సీఎం జగన్, రోజాకు కీలకమైన పదవి ఇచ్చారు. అయితే జగన్‌ను కలవకముందు, కలిసిన తర్వాత కూడా నామినేటేడ్ పదవి ప్రకటన రాలేదు. ఒకరోజు తర్వాత అనౌన్స్‌మెంట్ జరిగింది అసలు జగన్‌ను రోజా కలవకముందు కలిసిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? మధ్యలో అసలేం జరిగింది రోజా పోస్ట్ వెనక సాగిన ఇంట్రెస్టింగ్ స్టోరి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పులో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు, తప్పకుండా ఛాన్స్ వస్తుందని అందరూ ఆశించారు. స్పీకర్ రేసులోనూ రోజాపేరే వినిపించింది. అయితే జగన్, స్పీకర్ ప్రతిపాదనను రోజా సున్నితంగా తిరస్కరించారట. స్పీకర్ పదవిలో కూర్చున్నవారికి పొలిటికల్ కెరీర్ ఏమీ మిగలదని ఆందోళన చెందారట. సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని చెప్పారట. తనను మంత్రి పదవికే పరిశీలించాలని అన్నారట. దీంతో మినిస్ట్రీ ఇస్టారని, కాల్ వస్తుందని ఆశించారట. అయితే రోజా ఆశ నిరాశైంది. కులాల సమీకరణలు, ప్రాంతీయ, జిల్లాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని రోజాకు అవకాశం కల్పించేకపోయారు సీఎం జగన్. దీంతో ఒక్కసారిగా రోజాపై సానుభూతి వెల్లువెత్తింది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. రోజా కూడా ప్రమాణస్వీకారానికి రాకుండా అలకబూనారు. దీంతో వైసీపీలోనూ పెద్ద ఎత్తున రోజా డిస్కషన్ జరిగింది.
పార్టీకి, జగన్‌కు కష్టకాలంలో తోడుగా ఉండి, ధాటిగా పోరాడిన నేతగా పేరున్న రోజాకు, మంత్రి పదవి ఇవ్వకపోవడం, ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వైసీపీలో చర్చ జరిగింది. అందుకే రోజాకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని డిసైడైన జగన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాక్చర్ కార్పొరేషన్-ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. అయితే రోజాకు ఈ పోస్ట్ దక్కడం వెనక, 24 గంటల్లో చాలా ఆసక్తికరమైన తతంగమే జరిగింది.
రోజా అలకను గుర్తించిన జగన్, అమరావతికి రావాల్సిందిగా కబురు పంపారట. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజుముందే విజయవాడకు వచ్చారు రోజా. నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. జగన్‌ను చూసిన వెంటనే ఆమెకు దుంఖం ఆగలేదట. పార్టీ కోసం అసెంబ్లీలో, బయట ఎంతాగానో పోరాడానని, టీడీపీ మంత్రుల తీరును ఎండగట్టి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లానని, అలాంటి తాను మంత్రి పదవిని ఆశించడం తప్పా అంటూ కన్నీటి పర్యంతమయ్యారట. అయితే, రోజాను ఓదార్చిన జగన్, ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో వివరించారట. జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో పది నిమిషాల్లోనే అసహనంతో బయటికి వచ్చేశారు రోజా.
రోజాను జగన్‌తో పాటు సీనియర్లు సైతం వారించారు. చివరికి విజయమ్మ, షర్మిల, భారతి కూడా రోజాకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. కుటుంబ సభ్యురాలివని, సమీకరణాలతోనే ఇవ్వలేదని, రెండున్నరేళ్ల తర్వాత తప్పకుండా వస్తుందని, అర్థం చేసుకోవాలని చెప్పారట. తాను ఇక నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, జబర్దస్త్ ప్రోగ్రాంలో తిరిగి పాల్గొంటానని తెగేసి చెప్పారట రోజా. దీంతో రోజా పట్టుదల ముందు జగన్ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు కూడా ఫలించలేదు. రోజాకు ఏదో ఒక నామినేటేడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన జగన్, ఏపీఐఐసీ లాంటి కీలక సంస్థకు ఛైర్మన్‌గా చేద్దామని తీర్మానించారట. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలోనూ తీసుకుంటామని హామి ఇచ్చారట. అందుకే రోజా కలిసిన మరుసటి రోజే, కీలక పదవికు నామినేట్ చేశారు జగన్. ఇంతటితో రోజా అలక వీడారు. ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం వెనక ఇంత కథ జరిగింది.