ఇండోనేషియాలో సునామీతో 2018 విషాదాంతం

Update: 2018-12-31 05:17 GMT

ఈ ఏడాది అంతులేని విషాదం నింపిన ఘటన ఇండోనేషియా సునామీ. ప్రకృతి వికృత రూపం దాల్చి విలయం సృష్టించిన దుర్ఘటన.

గతంలో వచ్చిన భూకంపం..సునామీలతో అతలాకుతలమైన ఇండోనేషియాను మరోసారి సునామీ రూపంలో ముంచుకొచ్చిన ఉపద్రవం నిండా ముంచేసింది. అలల తీరం అలజడి రేపుతోంది.. ప్రశాంతంగా.. మనసుకు ఆహ్లాదాన్ని పంచాల్సిన సముద్రతీర ప్రాంతం.. ఉండుండి ఎగసెగసి పడుతోంది. ఒడ్డున ఉన్న వారితో దోబూచులాడుతూనే.. ఉన్నట్టుండి రాకాసి అలలు పడగ విప్పి కరాళ నృత్యం చేశాయి.. భారీ సునామీతో అపరిమిత ప్రాణ నష్టాన్ని చవిచూసిన ఇండోనేషియా తీర ప్రాంతం.. శవాల దిబ్బగా మారిపోయింది.

సముద్రగర్భంలో ఉన్న క్రెకటోవా అగ్ని పర్వతం ఈ మధ్య కాలంలో తరచుగా పొగలు విరజిమ్ముతోంది.. అయితే సముద్రం అడుగున ఉండటంతో దీని తీరు తెన్నులు పసిగట్టడం కాస్త కష్టమే.. అయితే క్రెకటోవా అగ్ని పర్వతం ఎప్పుడైనా బద్దలవ్వొచ్చని దాని తీవ్రత కెరటాల ద్వారా తీరాన్ని ధ్వంసం చేయచ్చనీ ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియాలో సముద్రంలో భూ కంపాలను మాత్రమే పసిగట్టే సమర్ధత ఉంది తప్ప అగ్ని పర్వతాల విస్ఫోటనాన్ని అంచనా వేసే సమర్ధత తమ దగ్గర లేదంటున్నారు ఇండోనేషియా అధికారులు. సముద్ర గర్భంలో అగ్ని పర్వతాలు భళ్లున బద్దలైతే భయంకరమైన వేగంతో అలలు విరుచుకుపడతాయి. ఆ విస్ఫోటనం తీవ్రతకు నీరు చాలా వేగంగా తురుముతున్నట్లు తీరం వరకూ తన్నుకొచ్చింది ఆ అలలే రాకాసి అలలుగా మారి అతలాకుతలం చేశాయి. ఆకలిగొన్న పులిలా తీరంలో ఉన్న వారిని తమలోకి కలిపేసుకుంటాయి.

తాజా సునామీ ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాలపై తన ప్రతాపాన్ని చూపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవుల్లో సునామీ వచ్చింది. సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలుతీర ప్రాంతంలోని వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక్క సునామీ చాలు.. నగరాలను నామరూపాల్లేకుండా చేసేయడానికి.. ఒక్క భయంకర కెరటం చాలు.. వేల వేల ఇళ్లను తునాతునకలు చేసేయడానికి.. అందుకు సాక్ష్యం పాలూ నగరమే.. ఇండోనేషియా లో సముద్ర తీరాన్న ఉన్న ఈనగరం సునామీ దెబ్బకు తుడిచిపెట్టుకు పోయింది.

కడలికెంత కోపమో చెప్పనక్కర లేదు.. గత కొన్నేళ్లుగా ఇండోనేషియాపై పగబట్టి సునామీల రూపంలో చుట్టుముట్టేస్తోంది.రాకాసి అలలు ఎగసిపడి సముద్ర తీరంలో విరుచుకుపడ్డాయి..సునామీ సమయంలో బాధితులకు తక్షణ సాయం అందించడమూ కష్టమే.. హటాత్తుగా విరుచుకుపడే పెను విపత్తు నుంచి తప్పించుకోవడమూ కష్టమే. అందుకే 2018 సంవత్సరం చివర్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.  

Similar News