అదో అద్భుత విజయం. సరిహద్దుల్లో మూడు నెలల పాటూ శత్రు సేనలను చీల్చి చెండాడిన మన వీర సైనికులు విజయ గర్వంతో నినదించిన వేళ అది.. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే రోజున కార్గిల్ కొండలపై భారత త్రివర్ణ పతాకం మేరా భారత్ మహాన్ అంటూ నింగి అంతా పరుచుకుంది. మన సైనికుల ధాటికి తోక ముడిచిన పాక్ సేనలు సరిహద్దులు దాటి పారిపోయాయి. ఇపుడు ఉగ్రవాద భూతం ఉక్కు కౌగిలిలో చిక్కుకుని విలవిలలాడుతున్న మన భారతావనికి మరో కార్గిల్ యుద్ధంలాంటి స్ఫూర్తి కావాలి దేశాన్ని బలహీన పరచి, అస్థిర పరిచే శక్తుల పాలిట కాలయములై గర్జించాల్సిన తరుణమిది. పదకొండేళ్ల కార్గిల్ విజయాన్ని గుండెల నిండా నింపుకుని మన దేశం కోసం యువతరం కదం తొక్కాల్సిన సందర్భమిది.
కార్గిల్ మన దేశ ఔన్నత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భమిది పరాయి గడ్డపైకి దొంగల్లా చొరబడిన పాకిస్థాన్ కు బుద్ధి చెప్పి, మన విదేశాంగ విధాన వైశిష్ట్యాన్ని తెలియ చెప్పిన ఉదంతం ఇది. శాంతి మంత్రం పేరుతో వెన్ను పోటు పొడిచిన పాకిస్థాన్ కు కీలెరిగి వాత పెట్టిన యుద్ధమిది.సారే జహాసే అచ్ఛా.. హిందూ సితా హమారా. అవును నిజమే.. ప్రపంచ దేశాలకన్నా మన దేశం ఎంతో గొప్పది. భారతీయమే మన ఊపిరి మువ్వన్నెల పతాకమే మన స్ఫూర్తి త్యాగ ధనుల పుణ్య ఫలం ఈ సువర్ణ భారతం అలీన విధానమే మన పథం.. పొరుగు దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకునే తత్వం కాదు మనది. అలాగని మన దేశ అంతరంగిక వ్యవహారాల్లో ఎవరైనా జోక్యం కలిగించుకుంటే చూస్తూ ఊరుకునే నైజం కాదు మనది. శత్రువుని సైతం మన్నించే సంస్కారం మనది. అందుకే పాకిస్థాన్ మనపై అదను చూసి దొంగ దెబ్బలు తీసినా, దాన్ని సమర్ధంగా ఎదుర్కొంటున్నామే గానీ ఆ దేశంపై ఉద్దేశ పూర్వకంగా దండ యాత్ర చేయలేదు. కార్గిల్ విజయం ఎన్డీ ఏ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను పెంచింది.
పాకిస్థాన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించిన బిజెపి తాము అధికారంలోకి రాగానే పాకిస్థాన్ పై కాస్త కఠినంగానే వ్యవహరించింది. నిలిచి పోయిన భారత, పాకిస్థాన్ దేశాల సంబంధాలను పునరుద్ధరించేందుకు వాజపేయి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ప్రభుత్వం హయాంలోనే కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేయడానికి లాహోర్ సందర్శించారు అప్పటి ప్రధాని వాజ్ పేయి. లాహోర్ లో చర్చలు జరుపుతుండగానే ముషారఫ్ ఆదేశాలతో కార్గిల్ సరిహద్దుల్లో పాక్ సేనలు చొరబడ్డాయి. కవ్వింపు కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భారత్ ఎదురు దాడి చేయక తప్పలేదు. భారత్ సత్తాను తక్కువగా అంచనా వేసిన పాకిస్థాన్ ఆపై గుడ్లు తేలేసింది. భారత సైన్యం దాడికి ఖంగు తిని తోక ముడిచింది.అయితే ఈ యుద్ధం అపార సైనిక నష్టాన్ని కలిగించిందన్నది వాస్తవం. అప్పటినుంచీ పాకిస్థాన్ ఉగ్రవాద దాడుల రూపంలో మనకు నష్టాన్ని కలిగిస్తూనే వుంది. భారత్ ప్రతిఘటిస్తూనే వుంది.. సరిహద్దుల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కవ్వింపు కాల్పులు, చొరబాట్లు పాకిస్థాన్ కుటిల బుద్ధికి ఉదాహరణలు.