మనం పఠించే శాంతిమంత్రం... ఉగ్రమూకలకు వరంగా మారుతుందా?

Update: 2019-02-16 07:41 GMT

నెహ్రూ హయాం నుంచి కూడా భారతదేశం శాంతి మంత్రం పఠిస్తూ వచ్చింది. చివరకు అది ప్రపంచం దృష్టిలో చేతకానితనంగా మారిపోయింది. శాంతి, సహనం మంచివే....కాకపోతే ఆత్మరక్షణలోనూ అదే ధోరణితో ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. అప్పట్లో ఇందిరాగాంధీ పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేశారు. నేటి నాయకులు మాత్రం ఆ విషయాన్ని గుర్తు చేయడానికే పరిమితమవుతున్నారు తప్పితే అంతకు మించిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. సర్జికల్ దాడుల విష‍‍యానికి వస్తే....పాకిస్థాన్ ను అవి పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. అందుకే ఆ దేశం అండతోనే ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు.

గతంతో పోలిస్తే...తాజా ఉగ్ర దాడి అనంతరం ప్రధాని మోడితో సహా మంత్రుల మాటల్లో తీవ్రత పెరిగింది. వీర జవాన్ల త్యాగాలను మరువమని నాయకులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరో వైపున రాహుల్ గాంధీ సైతం రెండు మూడు రోజులు రాజకీయాలను పక్కనబెడుతామన్నారు. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వానికి అండగా నిలబడుతామన్నారు. విపక్ష నాయకులు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యావత్ దేశం స్పందించింది. పలు చోట్ల సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ప్రతీకార దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల, నాయకుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ ఏ దిశగా వెళ్తాయన్నది కూడా ఆందోళన కలిగించే అంశమే.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్థాన్ లు పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం లేదు. మహా అంటే.......కార్గిల్ తరహా పరిమిత యుద్ధాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ లో అలజడి రేగితే....పాకిస్థాన్ ముక్కచెక్కలైతే.... ఆ దేశానికి ఉన్న అణుబాంబుల భద్రత ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వంటి నాయకులు పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయాలని సూచిస్తున్నారు. అలాంటివి చెప్పేందుకు బాగానే ఉంటాయి కానీ....ఆచరణలో సాధ్యమయ్యే అంశాలు కాదు. పాకిస్థాన్ లోనూ వేర్పాటు వాదాలు కొనసాగుతున్నా.....అవి అంత బలంగా లేవు. పాకిస్థాన్ నుంచి విడిపోయే స్థితిలో ఆ ప్రాంతాలు లేవు. ఇక మిగిలిన మార్గం ఒక్కటే....అంతర్గతంగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం....సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవడం....అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ను ఒంటరి చేయడం. ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం జరిగితే దేశంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి కళ్ళెం వేయడం సాధ్యమే.

భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. అయినా కూడా ఉగ్రవాద బాటనే ఎంచుకున్నది అంటే అందుకు ప్రధాన కారణం...పాకిస్థాన్ సైన్యం. ఆ దేశ రాజకీయాల్లో పాక్ సైన్యం ప్రమేయం తగ్గినప్పుడు మాత్రమే ఉగ్రవాదాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. అప్పటి వరకూ అటు ఆప్ఘనిస్థాన్ లో, ఇటు భారత్ లో ఉగ్రవాదం పెచ్చుమీరుతూనే ఉంటుంది. దక్షిణాసియాలో తమ ప్రాబల్యం చాటుకునేందుకు అమెరికా, చైనా లాంటి కొన్ని అగ్రరాజ్యాలు పాకిస్థాన్ కు తోడ్పడుతున్నాయి. వాటి తోడ్పాటు అరికట్టేందుకు భారత్ దౌత్యమార్గాల్లో కృషి చేయాలి. అంతర్జాతీయంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచాలి. ఇక చివరిగా.....కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనిదే భారత్ ఉగ్రవాద దాడులు నిలిచిపోయే అవకాశం లేదు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి జరగాలి. మరో వైపున ఉగ్రవాదానికి, మతానికి మధ్య ఉండే లింక్ తెంచేయాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే భారత్ ఉగ్రదాడులకు గురికాకుండా ఉండగలుగుతుంది.

Similar News