మినహాయింపుల ఎర... వేతనజీవులకు వల... ఎన్నికల తాయిలాలేనా?

Update: 2019-02-01 10:39 GMT

ఎన్నికల సంవత్సరంలో... అధికార బీజెపీ ఆఖరి బడ్జెట్ ను...కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయెల్...ఓట్ ఆన్ ఎకౌంట్ రూపంలో ప్రవేశపెట్టారు. టాక్స్ మినహాయింపుల రూపంలో 3 కోట్లమంది వేతనజీవుల ఓట్లకు గురిపెట్టారు. 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పొందుతున్న ఉద్యోగులు ఇక ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి... వోట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా...నరేంద్ర మోడీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించింది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 3 కోట్లమంది వేతనజీవులు, 2 కోట్ల మంది రైతులతో పాటు...మధ్యతరగతి వర్గాల ఓట్లు లక్ష్యంగా చేసుకొని...పలు రకాల పన్ను మినహాయింపులు ప్రకటించింది.

కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయెల్...పార్లమెంట్ లో కేంద్ర తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మోదీ సారథ్యంలో గత ఐదేళ్లుగా సుస్థిర పాలన అందించామని సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.. ఓటాన్‌ వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు 6వ స్థానానికి చేరిందన్నారు.

2022 నాటికి నవభారత రూపకల్పనే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పలురకాల పథకాలను రూపొందించినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకూ...రెండున్నరలక్షల నుంచి 5 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్న ఉద్యోగులు...ఇప్పటి వరకూ 10 శాతం పన్ను చెల్లిస్తూ వచ్చారు. అయితే...2019-20 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారు ఆదాయపుపన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి ప్రకటించారు.

ఆదాయం పన్ను పరిమితిని 2 లక్షల 50 నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అయితే...ఈ మినహాయింపులన్నీ 2019- 20 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయి. పొదుపు పెట్టుబడులతో కలిపి మొత్తం 6 లక్షల 50 వేల రూపాయల వరకూ పన్ను మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకూ ...40 వేల రూపాయలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని సైతం 50 వేల రూపాయలకు పెంచారు. అంతేకాదు...సెక్షన్ 80సీ పరిమితిని సైతం 50 వేల రూపాయల మేర పెంచారు.

ఇప్పట ివరకూ...సెక్షన్ 80సీ పరిమితి లక్ష రూపాయల వరకూ మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఇంటిఅద్దెల రూపంలో వచ్చే ఆదాయంలో సైతం మినహాయింపు ఇచ్చారు. ఈ మొత్తాన్ని 2 లక్షల.40 వేల రూపాయలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపైన సైతం టీడీఎస్‌ పరిమితిని 10 వేల నుంచి 40 వేల రూపాయల వరకూ పెంచారు. కేంద్ర మంత్రి ప్రకటించిన పలురకాల పన్ను మినహాయింపుల ద్వారా...3 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఊరట పొందనున్నారు. మొత్తం మీద...ఈ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ద్వారా... మధ్యతరగతి వర్గాలతో పాటు...వేతనజీవులు, పెన్షనర్లను ప్రసన్నం చేసుకోడానికి....మోడీ ప్రభుత్వం పన్ను మినహాయింపుల అస్త్రాన్నిప్రయోగించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Similar News