నోటిని అదుపులో పెట్టుకోకపోతే..!

Update: 2019-05-08 09:59 GMT

నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. వివాదాస్పదమైపోయాకా.. నేనా మాట అనలేదని నాలుక మడతపెట్టడం మన రాజకీయనాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఇలా ఇష్టం వచ్చినట్టు.. ఎక్కడపడితే అక్కడ.. ఎవరిమీద పడితే వారి మీద.. మాట్లాడితే, ఒక్కోసారి మాడు పగులుతుంది. ఈ అనుభవం రాహుల్ గాంధీకి ఇపుడు తెలిసింది.

ప్రచారంలో భాగంగా ఇటీవలి కాలంలో ప్రత్యర్థుల మీద తమ చిత్తానికి తాము మాటలు విసరడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇదే తరహాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇది కొంత వరకు పనికి వచ్చినట్టు అనిపించింది. సమావేశంలో జనాలు కరతాళ ధ్వనులతో.. కాంగ్రెస్ చినబాబుకు పూనకం వచ్చింది. దీనితో చాలా సార్లు ఇదే మాటని వాడుతూ వచ్చారు. అదే వరుసలో ఇంకాస్త ముందుకు వెళ్లి సుప్రీం కోర్టు ఇఛ్చిన తీర్పును ఉటంకిస్తూ మరీ తన వ్యాఖ్యలను సమర్థించుకోవాలని ప్రయత్నించారు. ఇక్కడే రాహుల్ పప్పులో కాలేశారు. నిజానికి అయన ఆ తీర్పు కాపీ చూసి ప్రసంగించారో.. అనుకోకుండా నోటికి వచ్చిందని మాట్లాడారో.. లేదా ఎవరన్నా రాసిచ్చిన పదాల్ని వల్లె వేశారో కానీ, చిక్కుల్లో పడ్డారు. తీర్పులో లేని అంశాన్ని మాట్లాడారంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖీ ఆయనపై కోర్టులో కేసు వేశారు. దీనితో కోర్టు రాహుల్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిని కూడా సాధారణ చర్యగానే భావించిన రాహుల్ కోర్టుకు తన సంజాయిషీ ఇచ్చారు. తన మాటల పట్ల విచారాన్ని వ్యక్తం చెశారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. బీజేపీ నేత మీనాక్షి లేఖీ మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ మాటల్లో పశ్చాత్తాపం లేదని, పైగా క్షమాపణలు కూడా చెప్పలేదంటూ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కోర్టు రాహుల్‌కు ఏప్రిల్‌ 23న నోటీసులిచ్చింది. ఈ నోటీసులకు స్పందించిన రాహుల్.. మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే అందులోనూ పాత అంశాలనే చెప్పారు. తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు మరోసారి పేర్కొన్నారు. అయితే రాహుల్‌ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కోర్టుకు క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలిపారు. దీంతో క్షమాపణలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు న్యాయస్థానం రాహుల్‌కు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు రాహుల్ తాజాగా క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారు.

ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న నేత ఇలా క్షమాపణలు చెప్పే విధంగా మాట్లాడటం ఆక్షేపణీయమే. మాటలకు హద్దులు లేకపోతె పరువు బజారున పడుతుందని ఈ ఉదంతం చెబుతొంది. అవాకులూ.. చవాకులూ మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే నాయకులకు ఈ సంఘటన ఓ చెంపపెట్టు లాంటిది. తమ చిత్తానికి ఎదుటివారిపై బురద చల్లితే తాత్కాలికంగా చెల్లుబాటు కావచ్చు కానీ, ఒక్కసారి ఎవరన్నా ఎదురుతిరిగితే పరువు గంగలో కలవడమే కాదు.. మళ్ళీ తమ మాటలు ఎవరు వైన్ పరిస్థితి ఉండదనేది అందరు తెలుసుకోవాల్సిన విషయం. అందుకు ఇది పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. 

Similar News